Telangana New Secretariat: కొత్త సచివాలయ భవనాన్ని వచ్చే నెల 17వ తేదీన అట్టహాసంగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ దిశగా ఏర్పాట్లను వేగవంతం చేసింది. ప్రారంభోత్సవ ముహూర్తం సమీపించిన నేపథ్యంలో పనుల పురోగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. తుదిమెరుగులు దిద్దుకుంటున్న సచివాలయ ముఖద్వారం మొదలు.. నలుదిక్కులా కలియతిరిగి అణువణువూ పరిశీలించారు.
ప్రధాన ద్వారం, ప్రహరీగోడ, రహదార్లను పరిశీలించిన సీఎం కేసీఆర్.. బ్యాంకులు, క్యాంటీన్, ఏటీఎంలు, మీడియా సెంటర్ కోసం చేపట్టిన నిర్మాణాలు, సందర్శకుల కోసం నిర్మిస్తున్న వెయిటింగ్ గదులను కలియ తిరిగారు. నూతన సచివాలయంలో సౌకర్యాలు, నిర్మాణ వివరాలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. సచివాలయ ఉద్యోగుల కోసం నైరుతిలో నిర్మితమవుతున్న ప్రార్థనా మందిరాన్ని పరిశీలించిన సీఎం.. అంతర్గత రోడ్లు, ఉద్యోగుల ఉపయోగార్థం నిర్మితమవుతున్న భవనాన్ని పరిశీలించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న వసతులు, వాహనాల పార్కింగ్ సదుపాయాన్ని కూడా సందర్శించారు.
పలు సూచనలు చేసిన సీఎం కేసీఆర్:సచివాలయ భవనం మొదటి అంతస్తులో.. మెట్లకు ఇరువైపులా చేయాల్సిన పనులకు సంబంధించి సీఎం కేసీఆర్ సూచనలు చేశారు. ఆరో అంతస్తులోని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఫాల్ సీలింగ్, ఉడ్ పానెలింగ్, ఏసీ ఫిట్టింగ్స్, తదితర తుది పనులను క్షుణ్ణంగా పరిశీలించి సూచనలు చేశారు. సీఎస్ ఛాంబర్, సీఎంఓ కార్యదర్శులు, సిబ్బంది, ప్రభుత్వ సలహాదారుల కోసం నిర్మించిన కార్యాలయాలను పరిశీలించారు.
సృజనాత్మకంగా, నాణ్యతతో పూర్తి చేయాలి:సీఎం ఛాంబర్లో కొన్ని మార్పులను సూచించారు. కారిడార్లలో తుది దశకు చేరుకున్న మార్బుల్ పాలిషింగ్, పెయింటింగ్ పనులు, ఎలివేషన్ లో భాగంగా కళాకృతులు, చివరిదశ పనులను మరింత సృజనాత్మకంగా, నాణ్యతతో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. సచివాలయంలో నిరంతరం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా.. ఏర్పాటు చేసిన సిగ్నల్ బూస్టింగ్ వ్యవస్థను కేసీఆర్ పరిశీలించారు.
ఇంటీరియర్ డిజైన్లు, విద్యుత్ పనులు, ఏసీల ఫిట్టింగ్, పిల్లర్లు, స్తంభాలకు జరుగుతున్న కళాత్మక ఆర్ట్ వర్క్ పనులు, పెయింటింగ్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి.. నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ప్రీమియం మార్బుల్ స్టోనింగ్ పనులు, ఉడ్ వర్క్స్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రానైట్, మార్బుల్ ఫ్లోరింగ్, ఫాల్స్ సీలింగ్, జీఆర్సీ పనులు, లిఫ్టుల పనితీరును అడిగి తెలుసుకున్నారు.