తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజూ ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు - Hyderabad Latest News

Telangana National Unity Vajrotsavam: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు మూడోరోజూ ఘనంగా జరిగాయి. జిల్లాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచాయి. స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులను ఘనంగా సన్మానించుకున్నారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరై నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.

తెలంగాణ
తెలంగాణ

By

Published : Sep 18, 2022, 8:52 PM IST

Telangana National Unity Vajrotsavam: ఏడాది పాటు నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మూడు రోజుల ప్రారంభోత్సవ సంబురాలు వైభవంగా జరిగాయి. నిజామాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. కవులు, కళాకారులను ఆయన సన్మానించారు. రాష్ట్రంపై గజనీ మహమ్మద్ లాగా భాజపా నేతలు దండెత్తుతున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో మతాల మధ్య చిచ్చు పెట్టడం మానుకోవాలని హెచ్చరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తీరును తప్పుపట్టారు. కేంద్రంలో ఎప్పటికీ భాజపా ప్రభుత్వమే ఉండదని గుర్తుంచుకోవాలని ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు.

రాష్ట్రంలో మూడో రోజూ ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాన్ని నడిపింది కవులు, కళాకారులేనని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ దాస్యశృంఖలాల నుంచి విముక్తి కోసం ప్రాణాలొడ్డిన అమరులను స్మరించుకోవడం అందరి బాధ్యతని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అందులో భాగంగా స్వాతంత్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి.

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, కలెక్టర్‌ శరత్‌ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. మెదక్‌లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి పాల్గొన్నారు. మన భాషా, సంస్కృతికి అద్దం పట్టేలా వజ్రోత్సవాలు మూడురోజుల పాటు ఘనంగా జరిగాయని ఆమె అన్నారు. ఈ వేడుకల్లో విద్యార్థుల పోతురాజుల వేషధారణలు, బతుకమ్మ,బోనాలు లాంటి కళారూపాలతో సందడి చేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి బడి పిల్లలతో పాదం కదిపారు.

"కుమురం భీం ఒక విధంగా పోరాటం చేశారు. రావి నారాయణరెడ్డి, చాకలి ఐలమ్మ పోరాటం చేశారు. ఏ పోరాటం వెనకైనా పదిమందికి మేలు జరిగే విధంగా ఉందని గుర్తు చేసుకోవాలి. లేకపోతే చరిత్రను వక్రీకరించే ప్రమాదం ఉంది. మన పెద్దలు చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉంది." - సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి

ఇవీ చదవండి:న్యూజిలాండ్‌లో 'రాజన్న సిరిపట్టు చీరలు' ఆవిష్కరణ.. కేటీఆర్ హర్షం

'కశ్మీర్​లో 3 దశాబ్దాల తర్వాత సినిమా హాల్స్.. ఇకపై జిల్లాకో మాల్ పక్కా'

ABOUT THE AUTHOR

...view details