పురపాలక ఎన్నికల నగారా మోగడం వల్ల ఇప్పుడు అందరి దృష్టి రిజర్వేషన్లపై పడింది. ఏ స్థానం ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉంది. రిజర్వేషన్ల ప్రక్రియ కోసం గతంలోనే రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాలు రెండు దఫాలుగా సేకరించారు. కొత్త చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేస్తారు.
2011 జనాభా లెక్కల ప్రకారం
వార్డుల వారీ రిజర్వేషన్లను జిల్లాస్థాయిలో కార్పొరేషన్, మున్సిపాల్టీ యూనిట్‌గా ఖరారు చేస్తారు. మేయర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ల రిజర్వేషన్లు రాష్ట్రం యూనిట్‌గా ఖరారు చేస్తారు. కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 13 కార్పొరేషన్లు, 128 మున్సిపాల్టీలు ఉన్నాయి. 13 కార్పొరేషన్లు ఒక యూనిట్‌గా మేయర్ పదవులకు రిజర్వేషన్ ఖరారు చేయనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 13 కార్పొరేషన్లలోని మేయర్ పదవులను ఎస్సీ, ఎస్టీల శాతానికి అనుగుణంగా కేటాయిస్తారు.
సగం సీట్లు మహిళలకు
ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు కనీస ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. యాభై శాతంలో మిగతా సీట్లను బీసీలకు రిజర్వ్ చేస్తారు. అన్ని కేటగిరీల్లోనూ సగం సీట్లను లాటరీ ద్వారా మహిళలకు కేటాయిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల పదవీకాలం ఇంకా పూర్తి కాలేదు. ఆ మూడు చోట్ల ఎన్నికలకు ఇంకా సమయం ఉంది.