రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50% పరిమితిని ఎత్తేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని తెరాస ఎంపీ బీబీ పాటిల్ (mp bb patil) డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం లోక్‌సభలో ఓబీసీలను గుర్తించే అధికారాలను రాష్ట్రాలకే ఇస్తూ కేంద్రం తీసుకొచ్చిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఓబీసీ జనగణన, ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణ నుంచి 40 సామాజిక వర్గాలు ఎన్నో ఏళ్ల నుంచి కేంద్ర ఓబీసీ జాబితాలో చోటు కోసం ఎదురు చూస్తున్నాయి. ఓబీసీ జనగణనను ఇప్పటికైనా కేంద్రం చేపడితే వారి స్థితిగతుల గురించి స్పష్టంగా తెలిసి వస్తుంది. ఓబీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి’’ అని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలి: నామ
తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు (trs mp nama nageswara rao) మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం దేశంలో తొలిసారి దళితబంధు పథకం తీసుకొచ్చింది. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తోంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రాలకు కల్పించే బిల్లుకు మేం సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం’’ అన్నారు.
పత్రాలు అందక విడుదల కాని వందల కోట్లు
కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ అమలు చేస్తున్న రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం కింద గత అయిదేళ్లలో తెలంగాణకు రూ.923.41 కోట్ల వార్షిక ప్రణాళికలను ఆమోదించినా కేవలం రూ.28.84 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన పత్రాలు అందకపోవడమేనని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ తెలిపారు. తెరాస సభ్యుడు జి.రంజిత్‌రెడ్డి మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు సమాధానమిచ్చారు.
సంక్షేమ పథకాలకు రూ.1,614 కోట్లు విడుదల
గత ఏడేళ్లలో ఎస్సీ, ఓబీసీల సంక్షేమ పథకాల కింద తెలంగాణకు రూ.1,614.24 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారశాఖ సహాయ మంత్రి ఎ.నారాయణస్వామి తెలిపారు. లోక్‌సభలో ఎంపీ బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. మంత్రి సమాధానం ప్రకారం 2018-19, 2019-20 సంవత్సరాల్లో పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద ఎస్సీ విద్యార్థులకు పైసాకూడా ఇవ్వలేదు.