Telangana MLA Quota MLC Notification : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద భర్తీ చేయాల్సిన రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం విడివిడిగా నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు డిసెంబర్ తొమ్మిదో తేదీన మండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో ఆ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ రెండు స్థానాల పదవీకాలం 2027 నవంబర్ 30వ తేదీ వరకు ఉంది. ఇప్పటికే ఈ రెండు స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. రెండింటికి విడివిడిగా ఉపఎన్నికలు(Telangana MLC Elections 2024) నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రానికి చెందిన రెండు స్థానాలకు కూడా ఈసీ విడివిడిగా నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఫలితంగా మండలి ఉపఎన్నికల్లో రెండు స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కనున్నాయి.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
Telangana MLC Election Notification 2024 : గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పాటు, అదే రోజు రాష్ట్ర అధికారిక గెజిట్‌లో కూడా విడిగా నోటిఫికేషన్లు ప్రచురిస్తారు. ఈ నెల 11వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. 18వ తేదీ సాయంత్రం ముగియనుంది. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ లోపు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. 29వ తేదీన ఈసీ ఎన్నికలు(EC Release MLC Election Notification) నిర్వహించనుంది. అదే రోజు సాయంత్రం ఎన్నికల కౌంటింగ్ జరనుంది.