తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రత్యక్ష నియామకాలపై కసరత్తు పూర్తి.. 49 వేల ఉద్యోగ ఖాళీలు! - minister harish rao

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల గుర్తింపు కసరత్తు తుదిదశకు చేరుకుంది. వివిధ ప్రభుత్వశాఖల నుంచి తీసుకున్న సమాచారం మేరకు ఆర్థికశాఖ ఖాళీలను గుర్తించింది. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగాలను మినహాయించగా ప్రత్యక్ష నియామకాల కింద భర్తీచేయాల్సిన పోస్టులు ప్రస్తుతానికి దాదాపు 49 వేలు ఉన్నట్లు అంచనాకు వచ్చింది.

direct-appointments
ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల గుర్తింపు

By

Published : Nov 4, 2021, 6:51 AM IST

రాష్ట్ర ఆర్థిక శాఖ.. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన సమాచారంతో.. ప్రత్యక్ష నియామకాలపై కసరత్తు పూర్తి చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ దస్త్రాన్ని సిద్ధంచేసి మంత్రివర్గ ఆమోదం (Cabinet approval) కోసం పంపించినట్లు తెలిసింది. ఖాళీల గుర్తింపు కోసం ప్రభుత్వ విభాగాలతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించడం ద్వారా పొరుగు, ఒప్పంద ఉద్యోగాలు సహా ప్రత్యక్ష నియామకాల కింద చేపట్టాల్సిన ఖాళీల వివరాలపై ఆర్థికశాఖ అధ్యయనం చేసింది. టీఎస్‌పీఎస్సీ, గురుకుల నియామక, పోలీసు, వైద్య, పంచాయతీరాజ్‌ నియామక బోర్డుల పరిధిలోకి వచ్చే ఉద్యోగాల సంఖ్యను గుర్తించింది. కీలకమైన జిల్లా, జోన్లు, మల్టీజోన్ల వారీగా వర్గీకరణ ఇప్పటికే పూర్తయింది. ఏయే పోస్టులు ఏ కేటగిరీలోకి వస్తాయో స్పష్టతనిస్తూ ఉత్తర్వులూ వెలువడ్డాయి. ఈ క్రమంలో బుధవారమిక్కడ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌ వారీగా వివిధ శాఖల నుంచి తీసుకున్న సమాచారాన్ని క్రోడీకరించిన అనంతరం ఖాళీలపై స్పష్టతకు వచ్చారు.

వీఆర్‌వోల సర్దుబాటు...

ధరణి అమల్లోకి రావడంతో గ్రామ రెవెన్యూ అధికారులకు విధులేమీ లేవు. ప్రస్తుతమున్న 6 వేల మంది వీఆర్‌వోలను వివిధ విభాగాల్లోని ఖాళీల్లో సర్దుబాటు చేయాలని సర్కారు గతంలో నిర్ణయించింది. వీరుగాక వివిధ శాఖల్లో ఒప్పంద ప్రాతిపదికన 10వేల మంది పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగులను మినహాయించి ప్రత్యక్ష నియామకాల కింద భర్తీ చేయాల్సిన ఖాళీలను ఆర్థికశాఖ గుర్తించింది. ఒప్పంద/పొరుగు సేవల నియామక ఖాళీలను ప్రత్యక్ష నియామకాల కింద గుర్తిస్తే ఆ ఉద్యోగులు ఉపాధి కోల్పోతారని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరించేందుకు ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న విషయంపైనా ఆర్థికశాఖ సమాలోచనలు చేసింది. ఒప్పంద ఉద్యోగులకు సర్వీసు వెయిటేజీ ఇచ్చి, పోటీ పరీక్షలు నిర్వహించాలా? ఇతరత్రా అవకాశాలున్నాయా? అనే అంశంపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. వీఆర్‌ఏలను రైతు వేదికలు, ఇతర విభాగాల్లో సర్దుబాటు చేయడంపై సమావేశం చర్చించనుంది.

అన్ని ఉద్యోగాలకూ ఒకేసారి ప్రకటనలు!

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నాటికి పోస్టుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. దస్త్రానికి కేబినెట్‌ ఆమోదం తెలిపిన వెంటనే ఆర్థికశాఖ ఖాళీలను నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీచేయనుంది. ఈ మేరకు సంబంధిత విభాగాలు సర్వీసు నిబంధనలు, రోస్టర్‌, రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు, ఎంపిక విధానాన్ని సంబంధిత నియామక ఏజెన్సీలకు అందజేస్తాయి. అనంతరం నియామక ఏజెన్సీలు నిర్ణీత గడువులోగా ప్రకటన వెలువరించి దరఖాస్తులు స్వీకరిస్తాయని, అన్ని ప్రకటనలూ ఒకేసారి వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం.

ABOUT THE AUTHOR

...view details