తెలంగాణ

telangana

ETV Bharat / state

Ministers Protest over paddy procurement : మోతెత్తిన చావుడప్పు.. కేంద్రం తీరుపై భగ్గుమన్న మంత్రులు - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

Ministers Protest over paddy procurement : ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా తెరాస శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ‘ఊరూరా చావు డప్పు’ పేరుతో నిర్వహించిన నిరసనల్లో రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

Ministers Protest over paddy procurement, chavu dappu program in telangana
తెలంగాణలో మంత్రుల ఆందోళనలు

By

Published : Dec 20, 2021, 4:52 PM IST

Updated : Dec 20, 2021, 5:32 PM IST

Ministers Protest over paddy procurement : రాష్ట్రవ్యాప్తంగా నిరసనలతో తెరాస శ్రేణులు హోరెత్తించాయి. ధాన్యం సేకరణలో కేంద్రంలోని భాజపా వైఖరిపై నిరసనలు తెలపాలన్న సీఎం కేసీఆర్ పిలుపుతో ఊరూరా ఆందోళన చేపట్టాయి. చావు డప్పులు, ర్యాలీలతో నిరసనలు వ్యక్తం చేశాయి. రాష్ట్ర రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో పలువురు మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. పలుచోట్ల ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

'అబద్ధాలపై భాజపా నాయకుల రాజకీయం'

భాజపా నాయకులు అబద్ధపు పునాదులపైన రాజకీయాలు చేస్తున్నారని ఆర్థికమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో రైతులు పండించిన పంటను ఎందుకు కొనడం లేదో చెప్పాలని నిలదీశారు. కేంద్రప్రభుత్వ వైఖరిపై గజ్వేల్‌లో నిరసన తెలిపారు.

'మధ్యప్రదేశ్​లో భాజపా అధికారంలో ఉంది. కొనే దిక్కులేక పండిన ఎల్లిగడ్డను మొత్తం రోడ్డున మీద పోసి అంటిపెడుతున్నారు. కానీ తెలంగాణ భాజపా నేతలు మాత్రం బాగా మాట్లాడుతున్నారు. అక్కడ రైతులు ఎందుకు అలా చేస్తున్నారో భాజపా నాయకులు సమాధానం చెప్తారా? రైతుల మీద ప్రేమ ఉంటే దిల్లీ సర్కార్​ను కేంద్రమంత్రి ఒప్పించాలి. కానీ రాజకీయాలు చేయొద్దు.'

-హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి

చావు డప్పు మోగించిన మంత్రులు

రైతులు తలెత్తుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు తీసుకొస్తుంటే.... కేంద్రం మాత్రం తెలంగాణపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో నిరసనలో పాల్గొన్నారు. మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాఠోడ్ నిరసనలో పాల్గొన్నారు. కేంద్రం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా చావు డప్పు మోగించారు. పంజాబ్‌ నుంచి ధాన్యం కొంటున్న కేంద్ర సర్కారు... రాష్ట్రంలో ఎందుకు కొనడంలేదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నిలదీశారు. మహబూబ్‌నగర్‌లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్‌గౌడ్‌... ఉత్తర భారతదేశానికి ఒక న్యాయం, దక్షిణ భారతదేశానికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు.

'కేంద్రానివి రైతు వ్యతిరేక విధానాలు'

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంత్రి మల్లారెడ్డి నిరసన చేపట్టారు. వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై భాజపా సర్కారు తీరు సరికాదన్నారు. నిర్మల్‌లో నిర్వహించిన ఆందోళనలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర సర్కారు రాష్ట్ర రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని విమర్శించారు.

'కేంద్రం వివక్ష సరికాదు'

రాష్ట్ర రైతుల పట్ల కేంద్రం వివక్ష చూపడం సరికాదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండిపడ్డారు. భాజపై వైఖరిని నిరసిస్తూ సత్తుపల్లిలో రైతులతో కలిసి.. సండ్ర నిరసన ప్రదర్శన చేపట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తెరాస నిరసనలో స్వల్పఉద్రిక్తత చోటు చేసుకొంది. గాంధీ చౌక్ వద్ద జడ్పీ ఛైర్ పర్సన్ విజయ, మున్సిపల్ ఛైర్మన్ రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో ధర్నా చేస్తుండగా... భాజపా కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. గాంధీ చౌక్ వద్ద బైఠాయించి ఇరువర్గాలు పరస్పర నినాదాలు చేసుకున్నాయి. పోలీసులు అడ్డుకుని, భాజపా నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణలో మంత్రుల ఆందోళనలు

ధాన్యం సేకరణలో కేంద్రంలోని భాజపా వైఖరిపై తెరాస.... అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఊరూరా చావు డప్పులు, ర్యాలీలతో నాయకులు ఆందోళనలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:TRS Protest Over Paddy Procurement: కేంద్రం తీరుపై భగ్గుమన్న తెరాస.. ఊరూరా చావు డప్పులతో ఆందోళనలు

Last Updated : Dec 20, 2021, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details