తెలంగాణ

telangana

ETV Bharat / state

Ministers on Budget: కేంద్ర బడ్జెట్​పై రాష్ట్ర మంత్రులు ఏమన్నారంటే..? - కేంద్ర బడ్జెట్​పై రాష్ట్ర మంత్రులు ఏమన్నారంటే

Ministers on Budget: కేంద్ర బడ్జెట్​పై రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఏ వర్గానికి ఆశాజనకంగా లేని బడ్జెట్​.. ప్రజా వ్యతిరేకమని పేర్కొన్నారు. తెలంగాణకు రూపాయి కూడా కేటాయించకపోవటం.. రాష్ట్రంపై కేంద్రం కక్ష సాధింపు చర్యకు నిదర్శనమని స్పష్టం చేశారు.

telangana ministers on union budget 2022
telangana ministers on union budget 2022

By

Published : Feb 1, 2022, 9:49 PM IST

కీలక వ్యవసాయ రంగానికి ప్రోత్సాహమేది...?

Ministers on Budget: కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగం, రైతుల పట్ల కేంద్రం విధానాలు సానుకూలంగా లేకపోవడంపై పట్ల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. కేంద్ర విధానాలు ఇలా ఉంటే రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేది ఎప్పుడు...? అని ప్రశ్నించారు. ఈ బడ్జెట్‌లో ఎంఎస్పీ ప్రస్తావనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం, ఆహారశుద్ధి పరిశ్రమలకు ఎలాంటి కేటాయింపులు లేవన్నారు. దేశంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగిన నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉన్నా... ఈ దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడం విచారకరం అని వ్యాఖ్యానించారు.

మిషన్​ భగీరథకు మరోసారి మొండిచేయి..

కేంద్ర బడ్జెట్​ను నిష్ప్రయోజక, నిరర్ధక బడ్జెట్‌గా మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అభివర్ణించారు. అధికారంలోకి రావడానికి కోసిన కోతలకు విరుద్ధంగా బడ్జెట్‌లో అన్నీ కోతలే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఉపాధి హామీకి ఇంతకు ముందు 98 వేల కోట్ల రూపాయలు ఉండగా.. ఇప్పుడు కేంద్రం దాన్ని 73 వేల కోట్లకు కుదించిందని మండిపడ్డారు. మిషన్ భగీరథకు మరోసారి మొండి చేయే మిగలిందన్నారు. గ‌త రెండేళ్లకాలంలో "న‌ల్ సే జ‌ల్ పథకం" కింద 5.7 కోట్ల కుటుంబాల‌కు తాగు నీరు అందుబాటులోకి తెచ్చామని చెబుతున్నప్పటికీ... ఈ పథకం జాబితాలో తెలంగాణ లేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

బడుగు, బలహీన వర్గాలకు నిరాశే..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్.. బడుగు, బలహీన వర్గాలకు నిరాశే మిగిల్చిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ బడ్జెట్‌లో ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగులు, వయో వృద్ధుల భద్రత, సంక్షేమానికి నయా పైసా కేటాయింపులు లేవని ఆరోపించారు. ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలు, బడుగు జీవులకు భాజపా వ్యతిరేకమని మరోసారి ప్రపంచానికి తేటతెల్లమైందన్నారు. విభజన హామీలకు సంబంధించిన ఐఐఎం ప్రస్థావన లేకపోగా... గిరిజన యూనివర్సిటీ కోసం నిధుల కేటాయింపులు లేవని విమర్శించారు. జిల్లాకొక నవోదయ పాఠశాల మంజూరు అంశం ఏ మాత్రం పట్టించుకోలేదని తీవ్రంగా తప్పుపట్టారు.

భాజపా నేతలు ఏం సమాధానం చెబుతారు..

కేంద్రం ప్రవేశపెట్టిన దశ, దిశా లేని బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు నిరాశ మిగిల్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. బడ్జెట్​లో అన్ని అసత్యాలు, అంకెల గారడీ తప్ప... ఏ వర్గానికి మేలు చేసేలా కేటాయింపులు చేయలేదని ఆరోపించారు. నూతన బడ్జెట్‌లో కేటాయింపులు పెంచకపోగా గతంలో ఉన్న వాటిలో కోతలు విధించడం దారుణమన్నారు. జీడీపీ విషయంలో తప్పుడు లెక్కలు చూపుతూ దేశ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. జాతీయ వనరులు సక్రమంగా వినియోగించుకోవడంలో... ఉద్యోగాల కల్పనలో విఫలమైందని ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, కార్మికులు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో మొండిచేయి చూపిందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్న భాజపా నేతలు ఏం సమాధానం చెబుతారని మంత్రి తలసాని ప్రశ్నించారు.

ఇక ఎంపీ అర్వింద్ ఇంట్లో కూర్చోవాలి..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా దేశ ప్రజలకు పైసా ఉపయోగం లేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 40 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం... రాష్ట్రానికి రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేకపోవడం చూస్తుంటే కేంద్రం వ్యవహరిస్తున్న తీరు... వివక్షకు దర్పణం పడుతోందని ఆక్షేపించారు. కేంద్ర వార్షిక బడ్జెట్‌లో నిజామాబాద్‌కు పసుపు బోర్డు హామీ నెరవేర్చలేకపోయినా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇకపై మాటలు మానుకొని ఇంట్లో కూర్చోవాలని హితవు పలికారు. భాజపాకు ప్రజలంతా గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని మంత్రి హెచ్చరించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details