Telangana Ministers Comments on Chandrababu : ఏపీలో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తెలంగాణలో డ్రామా చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా అని ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పేరుతో కుట్ర చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఖమ్మం సభతో మరో మోసానికి తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణను ఎండబెట్టారని మంత్రి ఆరోపించారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం గతంలో తెదేపాతో పొత్తు పెట్టుకున్నామని హరీశ్‌రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయలేని చంద్రబాబు.. తెలంగాణను ప్రగతి పథాన తీసుకెళ్తానని మాయమాటలు చెబుతున్నాడని విమర్శించారు. తెలంగాణలో అన్నివర్గాలవారిని.. చంద్రబాబు మోసం చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో పొత్తుపెట్టుకునేందుకే చంద్రబాబు తెలంగాణలో కొత్త మోసాలకు తెరలేపుతున్నారని దుయ్యబట్టారు.
''ఏపీని అభివృద్ధి చేయలేక.. తెలంగాణలో అభివృద్ధి చేస్తా అంటున్నారు. ఏపీని అప్పుల పాలు చేసి ఇక్కడకు వచ్చారు. చంద్రబాబు పాలనలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దోపిడీకి గురైంది. అన్ని వర్గాలను మోసం చేసింది. ఉద్యోగాలు అడిగిన యువతను నక్సలైట్లతో కాల్చి చంపారు. ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నినాదం ఐటీ. వ్యవసాయం దండగ అన్నది చంద్రబాబు. బీజేపీతో పొత్తుపెట్టుకునేందుకు డ్రామాలు చేస్తున్నారు. భాజపా పొత్తుకోసమే వెంపర్లాడుతున్నారు. తెలంగాణలో ఎన్ని నాటకాలాడినా ప్రజలు నమ్మరు. ఎన్టీఆర్ విలక్షణ నేత.. ఆయన గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. ఉచిత విద్యుత్ సాధ్యం కాదని చంద్రబాబు చెప్పిన విషయాన్ని తెలంగాణ సమాజం మరచిపోలేదు.''- హరీశ్‌రావు, మంత్రి