KTR Tweet on Turkey Earthquake : ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసేలా తుర్కియే, సిరియాల్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 5000కుపైగా చేరింది. ఒక్క తుర్కియేలోని 3వేల మందికి పైగా మంది మరణించగా.. సిరియాలో దాదాపు 1500 మంది చనిపోయినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. వేలాది మంది శిథిలాల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వారి కోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ భూకంపంలో మృతుల సంఖ్య మరింత భారీగా పెరగొచ్చని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. 20వేల మందికి పైగా మరణించి ఉంటారని అంచనా వేసింది.
KTR Tweet on Syria Earthquake : మరోవైపు భూకంపం ధాటికి కకావికలమైన తుర్కియే, సిరియాపై ప్రపంచదేశాలు సానుభూతిని వ్యక్తం చేస్తున్నాయి. సాయం అందిస్తామంటూ ముందుకు వచ్చి.. రెస్క్యూ బృందాలతోపాటు వైద్య సిబ్బందిని భూకంప ప్రభావిత ప్రాంతాలకు పంపిస్తున్నాయి. ఈ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Modi tweet on Turkey Earthquake : అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్న మోదీ.. తుర్కియేకు 100 మందితో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను, శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్లను పంపాలని ఆదేశించారు. వీటితో పాటు తుర్కియేకు సహాయ సామగ్రి, వైద్య బృందాలు పంపించాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. మోదీతో పాటు తాజాగా ఈ ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు.
Turkey Earthquake updates : 'టర్కీ, సిరియా భూకంపాలు తీవ్రంగా కలిచివేశాయి. ఆ దేశాల్లో వేలాది మంది చనిపోయినట్లు వస్తున్న వార్తలు చూసి చాలా బాధ కలుగుతోంది. ఇది చాలా బాధాకరమైన రోజు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి నా సంతాపం తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Syria Earthquake updates : మరోవైపు రెండు దేశాల్లోనూ భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు హుటాహుటిన సహాయక చర్యలను ప్రారంభించారు. గాయపడ్డవారిని ఆసుపత్రులకు తరలించారు. కాంక్రీటు కుప్పలు, ఇనుపచువ్వల కింద నలిగిపోయినవారి కోసం అన్వేషణ సాగించారు. కొన్నిచోట్ల శిథిలాల అడుగు నుంచి ప్రజలు ఆర్తనాదాలు చేయడం వినిపించింది. క్షతగాత్రుల చేరికలతో స్థానికంగా ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. వారి హాహాకారాలతో పరిస్థితులు దయనీయంగా కనిపించాయి. అంతకుముందు- భూకంప తీవ్రతకు భవనాలు ఊగడంతో కొన్ని నగరాల్లో జనం రోడ్లపై బిక్కుబిక్కుమంటూ గడిపారు.
కొద్దిగంటల వ్యవధిలో వరుసగా వచ్చిన పెను భూకంపాల వల్ల తుర్కియే చిగురుటాకులా కంపించింది. పేకమేడల్లా కూలిన భవనాల కింద ఛిద్రమైన జీవితాలతో ఆ దేశం మరుభూమిని తలపిస్తోంది. తుర్కియే చరిత్ర మొత్తం భూకంపాలమయం. ఆ దేశంలోని 98 శాతం భూభాగానికి ప్రకంపనల ముప్పు ఉంది. ప్రధాన నగరమైన ఇస్తాంబుల్ సహా మూడోవంతు భాగానికి ఆ ప్రమాదం చాలా ఎక్కువ. 2020లోనే అక్కడ 33వేల ప్రకంపనలు నమోదయ్యాయి. అందులో 4.0 తీవ్రతను మించినవి 322 ఉన్నాయి. భౌగోళికంగా చాలా సంక్లిష్టమైన కూడలిలో ఉండటం, సన్నద్ధత లోపించడం వంటి కారణాలు ఈ దేశానికి పెను శాపాలయ్యాయి.