Minister KTR Satires: మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగాస్త్రాలు విసిరారు. మొత్తానికి ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచంలో పెట్రోలు, డీజిల్ ధరల్లో దేశం అగ్రస్థానంలో ఉందంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కొనుగోలు శక్తి సమానత్వం అంచనా ఆధారంగా ప్రపంచంలో భారత్‌లో ఎల్‌పీజీ ధరలు అధికంగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో పెట్రోలు ధరలు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ 3వ స్థానం, డీజిల్ ధరల్లో అధికంగా దేశాల్లో భారత్ 8వ స్థానంలో ఉన్నాయంటూ తీవ్రంగా తప్పుపట్టారు.
మరోవైపు... దేశంలో స్థానిక భాషల్లో కాకుండా హిందీలో మాట్లాడాలన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలపై సైతం కేటీఆర్ ఘాటుగా స్పందించారు. నేను మొదట భారతీయుడ్ని అయినందుకు గర్వపడుతున్నాను. ఆ తర్వాత తెలుగువాడ్ని... తదుపరి తెలంగాణవాసినంటూ చెప్పుకొచ్చారు. తాను మాతృభాష తెలుగులో మాట్లాడతాను... ఆ తర్వాత ఆంగ్లం, హిందీ, కొంచెం ఉర్దు భాషలో కూడా మాట్లాడతానని తెలిపారు. ఆంగ్ల భాషకు ప్రత్యామ్నాయంగా హిందీ మాట్లాడాలంటూ మాపై రుద్దడం ఆపాలని స్పష్టం చేశారు.