తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్-విజయవాడ రహదారి సమస్యలు పరిష్కరించండి: కేటీఆర్ - minister ktr letter to nithin gadgari

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి అంశంలో ప్రస్తుత సమస్యలు తొలగించాలని కోరుతూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారికి రూ.500 కోట్ల అదనపు నిధులు కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు.

minister ktr letter to central transport minister nithin gadkari
కేంద్ర మంత్రి గడ్కరీకి కేటీఆర్ లేఖ

By

Published : Oct 1, 2020, 4:08 PM IST

హైదరాబాద్ నగరానికి అత్యంత కీలకమైన విజయవాడ - హైదరాబాద్ జాతీయరహదారి విషయంలో ఉన్న ప్రస్తుత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఈ రహదారి.. నగర పరిధిలో సుమారు 25 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని, అత్యంత రద్దీ ప్రాంతాల్లో లెవెల్ జంక్షన్లు, సర్వీస్ రోడ్డు వంటి సౌకర్యాలు లేవని, లేన్ల సామర్థ్యాన్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని జాతీయరహదారిని మరింతగా అభివృద్ధి చేసేందుకు 500 కోట్ల రూపాయలతో డీపీఆర్ రూపొందించినట్లు కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్ నగర విస్తరణకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలికవసతుల కల్పన కోసం ప్రాజెక్టులు చేపట్టిందని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేక చొరవతో హైదరాబాద్ నగరానికి నాలుగు అర్బన్ ప్రాజెక్ట్​లు వచ్చాయని, అందులో మూడింటి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. అంబర్ పేట ఫ్లై ఓవర్ కు సంబంధించిన పనులు కూడా ప్రారంభమవుతాయని కేటీఆర్ తెలిపారు.

ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ వంటి కార్యక్రమాలకు పూర్తిగా రాష్ట్ర నిధులను ఖర్చు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో పాటు హైదరాబాద్ కు భౌగోళిక అనుకూలతల దృష్ట్యా నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని... గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్​బుక్, సేల్స్ ఫోర్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయని పేర్కొన్నారు.

ఫార్మా, డిఫెన్స్, ఏరోస్పేస్ వంటి రంగాల్లో పెద్దఎత్తున తయారీ పరిశ్రమలు వస్తున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుత డిమాండ్ తో పాటు భవిష్యత్తు అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తి చేసిందని... ఎస్సార్డీపీ కార్యక్రమంలో భాగంగా అనేక ఫ్లై ఓవర్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, రైల్వే అండర్ బ్రిడ్జిలు, లింకు రోడ్ల సౌకర్యం కల్పించిందని వివరించారు.

కొవిడ్ సంక్షోభం, లాక్ డౌన్ సమయంలో పెద్ద ఎత్తున రహదారి మౌలిక వసతుల పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన మౌలికవసతుల కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇచ్చేలా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారికి రూ. 500 కోట్ల అదనపు నిధులు కేటాయించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కోరారు.

ABOUT THE AUTHOR

...view details