MINISTER KTR: పర్యావరణహితంగా, హైదరాబాద్ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అదే విధంగా రాష్ట్రంలోని 141 పురపాలక, నగరపాలక సంస్థలకు చెందిన మాస్టర్ ప్లాన్‌లు వచ్చే ఏడాది మార్చి 31 2023 నాటికి సిద్ధం చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.
ధరణిలో కొన్ని సవరించాల్సినవి ఉన్నాయని ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి హరీష్ నేతృత్వంలోని సబ్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసిందన్నారు. సరసమైన ధరలతో గృహనిర్మాణాలను తమకు అప్పగించాలని క్రెడాయ్ చేసిన వినతిపై స్పందించిన మంత్రి ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సీవరేజ్ ట్రీట్‌మెంట్ వందశాతం పూర్తవుతుందని కేటీఆర్ తెలిపారు. భవన నిర్మాణాలల్లో నిబంధనలు పక్కాగా పాటించాలని సూచించారు. ఇందుకోసం నిర్మాణ సంస్థలు స్వీయనియంత్రణ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
"తెలంగాణలోని 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలున్నాయి. మార్చి31 2023 లోపు అన్ని మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్‌లు సిద్ధం చేస్తాం. గతంలో తయారు చేసిన మాస్టర్ ప్లాన్‌లు తప్పుల తడకగా ఉన్నాయి. సీఎం ఆదేశాలకనుగుణంగా కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాం. పర్యావరణ హితంగా హైదరాబాద్ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండానే 111జీవోను తీసివేశాం. కావున ఆ ప్రాంతాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. ఈ ప్రభుత్వం గ్రీన్ బడ్జెట్ తెచ్చింది. మున్సిపల్ బడ్జెట్లో కూడా 10శాతం పర్యావరణ పన్నును తెచ్చాం. 230 కోట్ల మొక్కలు నాటిన ఘనత కేసీఆర్‌ది. ప్రభుత్వం 10కోట్ల చదరపు అడుగుల్లో 20 వేల కోట్ల పెట్టుబడితో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్నాం. బడ్జెట్లో కొత్త పాలసీని తీసుకొచ్చాం. ప్లాట్ ఉన్నవారు ఇల్లు కట్టుకునేందుకు రూ.3లక్షల రూపాయలు అందిస్తున్నాం. ఒక్కో నియోజక వర్గానికి మూడువేల యూనిట్లు మంజూరీ చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు."