తెలంగాణ

telangana

ETV Bharat / state

MARTYRS MEMORIAL: అద్భుత కట్టడంగా తెలంగాణ అమరవీరుల స్మారకం

తెలంగాణ అమరవీరుల స్మారకం పనులు వేగవంతమయ్యాయి. కరోనా కారణంగా గత కొన్నాళ్లుగా నెమ్మదించిన పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. స్మారకం చుట్టూ వచ్చే స్టెయిన్ లెస్ స్టీల్ క్లాడింగ్​కు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. దుబాయికి చెందిన ఓ కంపెనీ అదే తరహాలో ముందు నమూనాను సిద్ధం చేసి అందుకు అనుగుణంగా తుదిపనులు పూర్తి చేయనుంది. మరో నాలుగైదు నెలల్లో స్మారకం పనులను పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది.

MARTYRS MEMORIAL: అద్భుత కట్టడంగా తెలంగాణ అమరవీరుల స్మారకం
MARTYRS MEMORIAL: అద్భుత కట్టడంగా తెలంగాణ అమరవీరుల స్మారకం

By

Published : Sep 12, 2021, 4:52 PM IST

అద్భుత కట్టడంగా తెలంగాణ అమరవీరుల స్మారకం

అమరవీరుల త్యాగాలకు తగిన గౌరవం లభించేలా... వారిని ఎల్లప్పుడూ స్మరించుకునేలా హైదరాబాద్ నడిబొడ్డున స్మారకం నిర్మాణం అవుతోంది. హుస్సేన్ సాగర్ తీరాన, సచివాలయం ఎదురుగా లుంబినీపార్కును ఆనుకొని అమరవీరుల స్మారకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. విభిన్నంగా నిర్మితమవుతోన్న స్మారకంలో మ్యూజియం, ఫొటో గ్యాలరీ, ఆర్ట్ గ్యాలరీతో పాటు జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించేలా ఉత్తమ కన్వెన్షన్ హాల్ కూడా ఉండనున్నాయి. మూడెకరాలకు పైగా విస్తీర్ణంలో ఆరు అంతస్థుల్లో ఈ నిర్మాణం జరుగుతోంది. 26,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో స్మారకం అందుబాటులోకి రానుంది. మొత్తం నిర్మాణం గరిష్టంగా భూమి నుంచి 50 మీటర్ల ఎత్తులో ఉండనుంది. టెర్రేస్ లెవల్ పైన 27 మీటర్ల ఎత్తులో దీపం నమూనాను ఏర్పాటు చేయనున్నారు. అమరుల స్ఫూర్తి నిత్యం జలించేలా విభిన్న తరహాలో ఈ దీపాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

క్లాడింగ్​ పనుల కోసం అంతర్జాతీయ సంస్థ

స్మారకం ప్రవేశద్వారం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణానికి సంబంధించిన ఉక్కు సహా ఇతర పనులు దాదాపుగా పూర్తయ్యాయి. స్మారకానికి చుట్టూ స్టెయిన్ లెస్ స్టీల్​తో కూడిన ఫ్రేమింగ్​తో నిర్మాణం చుట్టూ క్లాడింగ్ పనులు చేయాల్సి ఉంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలను సంప్రదించింది. గతంలో ఈ తరహా పనులు చేసిన కొద్ది సంస్థల్లో నుంచి ఉత్తమమైన సంస్థను ఎంపిక చేసింది. దుబాయికి చెందిన ఆ కంపెనీ ప్రస్తుతం క్లాడింగ్ పనులకు సంబంధించిన కసరత్తు చేస్తోంది. కరోనా కారణంగా ఈ పనులు ఆలస్యమయ్యాయి. కరోనాతో రాకపోకలు స్తంభించిపోవడంతో స్టెయిన్ లెస్ స్టీల్ సమకూర్చుకోవడం, అందుకు సంబంధించిన పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం సాధారణ కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో సంబంధించిన పనులను వేగవంతం చేశారు.

విదేశాల నుంచి స్టెయిన్​లెస్​ స్టీల్​

స్మారకం నమూనాకు అనుగుణంగా దుబాయిలోనే స్టెయిన్ లెస్ స్టీల్ ప్యానళ్లను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని నౌక ద్వారా మనకు సమీపంలో ఉన్న ఓడరేవుకు, అక్కణ్నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ తీసుకొస్తారు. ఇందుకు అవసరమైన స్టెయిన్ లెస్ స్టీల్​ను జర్మనీతో పాటు వివిధ ఇతర దేశాల నుంచి సమీకరించుకోవాల్సి ఉంది. ఆ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. స్టెయిన్ లెస్ స్టీల్​తో స్మారకానికి సంబంధించిన నమూనాను ముందుగా సిద్ధం చేశారు. కొద్ది రోజుల్లోనే ఆ నమూనాను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో స్టెయిన్ లెస్ స్టీల్ ఫ్రేమింగ్​ను రూపొందిస్తారు. దాన్ని నిర్మాణం చుట్టూ క్లాడింగ్ చేస్తారు. వీలైనంత త్వరగా ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరో నాలుగైదు నెలల్లో పనులన్నీ పూర్తి చేసి స్మారకాన్ని సిద్ధం చేయనున్నారు.

ఇదీ చదవండి: Harish Rao: పాదయాత్ర ఎందుకో ప్రజలకు చెప్పాలి: హరీశ్​ రావు

ABOUT THE AUTHOR

...view details