తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Martyrs Memorial : అమరుల త్యాగాల ప్రతిబింబం .. తెలంగాణ అమరవీరుల స్మారకం - KCR inaugural tomorrow Telangana martyrs memorial

Telangana Martyrs Memorial Inauguration : తెలంగాణ కోసం అసువులు బాసిన అమరులకు.. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఘనంగా నివాళి అర్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం రేపు ప్రారంభం కానుంది. అంతకు ముందు అమరుల గౌరవార్థం సాగరతీరాన .. కళాకారుల భారీ ర్యాలీ జరగనుంది. స్మారకం ప్రారంభోత్సవం జరగనున్న సభలోనూ.. అమరులకు నివాళిగా వేలాది మంది విద్యుత్ దీపాలు వెలిగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా అమరులకు అంజలి ఘటించనున్నారు.

Telangana martyrs memorial
Telangana martyrs memorial

By

Published : Jun 21, 2023, 8:11 AM IST

రేపు తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం

Telangana Martyrs Memorial Inauguration Tomorrow :రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్మించిన మరో ప్రతిష్ఠాత్మక కట్టడం రేపు ప్రారంభం కానుంది. పొలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, సమీకృత సచివాలయం ఇప్పటికే అందుబాటులోకి రాగా.. వినూత్నంగా, ప్రత్యేకంగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకానికి రేపు ప్రారంభోత్సవం జరగనుంది. రేపు సాయంత్రం 6:30 గంటలకు అమరుల స్మారకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు.

స్వపరిపాలన ధ్యేయంగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి అసువులు బాసిన అమరవీరుల స్మారకార్థం.. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం ఎదురుగా ప్రత్యేక నిర్మాణం చేసింది. మూడున్నర ఎకరాలకుపైగా విస్తీర్ణంలో దాదాపు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. వినూత్నంగా, అరుదైన కట్టడాల్లో ఒకటిగా ఉండేలా... చికాగో బీన్, దుబాయ్ మ్యూజియం లాంటి వాటిని పరిశీలించిన ఈ నిర్మాణాన్ని చేపట్టారు.

అమరుల త్యాగాల స్ఫూర్తి.. నిత్యం జ్వలించేలా : పూర్తిగా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో ప్రమిద, దీపం ఆకృతిలో స్మారకం నిర్మాణం జరిగింది. ఎక్కడా ఎలాంటి విభజన రేఖలు లేకుండా పూర్తిగా ఏకరూపంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. జర్మనీ నుంచి నాణ్యమైన స్టీల్‌ను సమకూర్చుకొని దుబాయ్‌లో ప్యానెల్స్ తయారు చేసి ఇక్కడకు తీసుకొచ్చి స్మారకం చుట్టూ అమర్చారు. ఇందుకోసం కార్మికులు కూడా అక్కడి నుంచే వచ్చారు. అమరుల త్యాగాల స్ఫూర్తి.. నిత్యం జ్వలించేలా ఉండాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా దీపం ఆకృతిని రూపొందించారు.

ప్రత్యేకమైన కార్బన్ స్టీల్‌తో ఈ దీపం ఆకృతిని తయారు చేసి.. ఏళ్ల తరబడి చెక్కు చెదరకుండా ఉండేలా రంగులు అద్దారు. పసుపు వర్ణ శోభితంతో దీపం కాంతులీనుతోంది. భూమి నుంచి 45 మీటర్ల ఎత్తుతో దీపం ఉంది. మొత్తం ఆరు అంతస్థుల్లో స్మారకాన్ని నిర్మించారు. రెండు బేస్‌మెంట్ అంతస్థుల్లో వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో కిచెన్, స్టోరేజ్, వర్క్‌షాప్‌తోపాటు ప్రదర్శన శాల ఏర్పాటు చేశారు. మొదటి అంతస్థుల్లో మ్యూజియం, లైబ్రరీ, ఆడియో విజువల్ రూం నిర్మించారు. రెండో అంతస్థులో కన్వెన్షన్ హాల్, మూడు, నాలుగు అంతస్థుల్లో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు.

KCR Inauguration Telangana Martyrs Memorial Tomorrow : అమరుల స్మారక ప్రాంగణాన్ని సుందరంగా లాన్స్, అందమైన ఫౌంటెయిన్లతో తీర్చిదిద్దారు. స్మారకం ప్రవేశం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్మారకం లోపలికి వెళ్లిన వెంటనే.. అమరులకు అంజలి ఘటించేలా ప్రత్యేకమైన నమూనాను ఏర్పాటు చేశారు. గ్రానైట్‌పై స్త్రీ, పురుష ముఖాకృతిలు ఉండేలా తీర్చిదిద్దిన ఈ నమూనా ఇట్టే ఆకట్టుకుంటోంది. లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఎయిర్‌కూలింగ్, ఎయిర్ ప్యూరిఫయర్, ఎయిర్ కండిషనింగ్, పూర్తి బ్యాకప్ జనరేటర్.. మురుగునీటి శుద్ధి వ్యవస్థ, భద్రత కోసం అత్యాధునిక కెమెరాలు, తదితర సదుపాయాలు కల్పించారు.

Telangana Martyrs Memorial :స్మారకం ప్రారంభోత్సవానికి ముందు అమరుల గౌరవార్థం ఎన్టీఆర్ మార్గ్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. 5,000లకు పైగా కళాకారుల ప్రదర్శనతో.. ఈ ర్యాలీ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం నుంచి అమరుల స్మారకం వరకు జరగనుంది. స్మారకం ప్రారంభం అనంతరం జరగనున్న సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. సభకు హాజరయ్యే వారంతా విద్యుత్ దీపాలను వెలిగించి.. అమరులకు నివాళి అర్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేపు అన్ని చోట్లా అమరులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి సంస్మరణ తీర్మానాలు చేయనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details