గుజరాత్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య లిమిటెడ్ విజయగాథపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ మార్క్‌ఫెడ్ సంస్థ ఛైర్మన్ మార గంగారెడ్డి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి బృందం అహ్మదాబాద్‌లో పర్యటించనుంది. అమ్రేలిలో 1.25 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల వేరుశనగ శుద్ధి కేంద్రం, నరోల్, కలోల్‌లో రైస్ మిల్లు, పప్పుల మిల్లు, మెహ్సానాలోని పత్తి జిన్నింగ్ ప్రాసెసింగ్ యూనిట్ వంటివి సందర్శించి అధ్యయనం చేయనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి గుజరాత్ వెళ్లనుంది.
అనుభవాల అధ్యయనం
అక్కడి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన ఎరువులు, పురుగు మందులను గుజరాత్ మార్క్‌ఫెడ్ మార్కెటింగ్ చేస్తోందని మార్క్‌ఫెడ్ ఛైర్మన్ మార గంగారెడ్డి తెలిపారు. బహుళ ప్రాచుర్యం పొందిన వీటిని దేశవ్యాప్తంగా ప్రోత్సహించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించిందని పేర్కొన్నారు. ఆ ఉత్పత్తులపై స్వయంగా అధ్యయనం చేసి తెలంగాణలో రైతులకు అందుబాటులోకి తీసుకురావాలనేదే తమ లక్ష్యమని వివరించారు. మార్క్‌ఫెడ్ సేవలకు సంబంధించి గుజరాతీ రైతుల అనుభవాలు తెలుసుకోనున్నట్లు తెలిపారు.