Telangana Liquor Shops Reservations : రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు కోసం నేటి నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్న నేపథ్యంలో దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్ల విధానంపై ఆబ్కారీ శాఖ కసరత్తు పూర్తి చేసింది. నూతన మద్యం విధానం (2023-2025) ప్రకారం మొత్తం 2620 దుకాణాల్లో గౌడ్లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం లెక్కన రిజర్వేషన్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ఆయా రిజర్వేషన్లకు అనుగుణంగా దుకాణాల కేటాయింపుపై అధికారులు జిల్లాల వారీగా గురువారం ఎంపిక ప్రక్రియ చేపట్టారు. మిగిలిన 1834 దుకాణాలకు ఓపెన్ కేటగిరీ కింద ప్రకటించారు. ఎక్సైజ్ జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని డ్రా పద్ధతిన రిజర్వుడ్ దుకాణాలను ఎంపిక చేశారు.
Telangana Liquor Shops Tenders Notification 2023 : జిల్లాల వారీగా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి, జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారితో కూడిన కమిటీ సమక్షంలో కలెకర్లు ఈ ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. మరోవైపు షెడ్యూలు ప్రాంతాల్లో ఇది వరకే ఎస్టీలకు కేటాయించిన దుకాణాలను ఈ ప్రక్రియ నుంచి మినహాయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల్లో ఇలాంటివి 95 ఉన్నాయి. వేలంలో ఈ దుకాణాలకు ఎస్టీలు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మిగిలిన దుకాణాల నుంచే గురువారం ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. కొత్త మద్యం విధానం నోటిఫికేషన్ ప్రకారం గౌడ సామాజిక వర్గానికి 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 కేటాయించారు. షెడ్యూలు ప్రాంతాల్లోని 95 దుకాణాలు పోనూ ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లకు సరిపడే రీతిలో 36 దుకాణాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు.
మొదట జిల్లాల వారీగా అన్ని దుకాణాలకు గెజిట్ సీరియల్ నంబర్లను ప్రకటించి.. ప్రతి సంబరుకు ప్రత్యేక టోకెన్ కేటాయించారు. అన్ని టోకెన్లను ఒక డబ్బాలో వేసి.. మొదటి డ్రా తీసిన టోకెన్ నంబర్ ఎస్టీలకు, రెండో టోకెన్ తీసిన నంబర్‌ను ఎస్సీలకు, మూడో టోకెన్ నంబర్‌ను గౌడ కులస్థులకు కేటాయించారు. ఇలా అన్ని ఆబ్కారీ శాఖ రిజర్వుడు దుకాణాల కేటాయింపు పూర్తి చేశారు. ఇవాళ్టి నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుండగా.. 21వ తేదీన డ్రా ద్వారా కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి చేయనున్నారు.