భాజపా అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అక్టోబర్ 17ను తెలంగాణ విమోచన దినం నిర్వహించాలని తొలి సంతకం చేస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ప్రజలు స్వచ్ఛ వాయువులు పీల్చుకున్న ఈ రోజు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అగౌరపరుస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యక్రమంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎంఐఎం పార్టీ మెప్పు కోసమే విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు.
బర్కత్‌పురలోని భాజపా నగర కార్యాలయంలో
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బర్కత్‌పురలోని భాజపా నగర కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భాజపా సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్‌రావు జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరావు, అంబర్‌పేట నియోజకవర్గ కార్పొరేటర్లు, భాజపా ముఖ్యనాయకులు పాల్గొన్నారు.