ఈనెల 6 నుంచి శాసనసభ సమావేశాలు.. 8న బడ్జెట్.. బడ్జెట్ సమావేశాల ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6 నుంచి శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. శాసనసభ, మండలి సభ్యులనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం పూర్తయ్యాక ఉభయ సభల సభా వ్యవహారాల సలహా సంఘాలు విడివిడిగా భేటీ అవుతాయి. బడ్జెట్ సమావేశాల పనిదినాలు, ఎజెండా, చర్చించాల్సిన అంశాలు.. ప్రవేశపెట్టాల్సిన బిల్లులను బీఏసీ భేటీలో ఖరారు చేస్తారు. బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ కూడా అదే రోజు ఖరారవుతుంది.
8న బడ్జెట్
7న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ.. ముఖ్యమంత్రి సమాధానం ఉండే అవకాశాలున్నాయి. 8న 2020-21 ఆర్థిక సంవత్సరానికి... రాష్ట్ర వార్షిక ప్రణాళికను ప్రభుత్వం అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు వేగవంతం చేసింది. మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్... సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షించారు.
ఆదాయ మార్గాలపై కసరత్తు
దేశంలో నెలకొన్న ఆర్థికమాంద్యం కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో తగ్గుదల, రాష్ట్ర సొంత రాబడులు తగ్గిన వేళ అనుసరించాల్సిన వ్యూహంపై.. సర్కార్ ప్రధానంగా దృష్టి సారించింది. వీలైనంత వరకు స్వీయ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై.. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తోంది. ప్రజలపై అదనపు భారం వేయకుండా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై.. రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది. వంద శాతం పన్నుల వసూళ్లు, లీకేజీలు లేకుండా అరికట్టడం.. పూర్తి స్థాయిలో పారదర్శక విధానాలు అమలు చేయడం లాంటివి ప్రధానంగా ఉన్నాయి. భూముల మార్కెట్ విలువ పెంపు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు.. భూములు, భవనాల క్రమబద్ధీకరణ తదితర ప్రతిపాదనలు ప్రభుత్వం ముందున్నాయి. వీటి పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయమై ప్రభుత్వం అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తోంది. భూముల అమ్మకం ద్వారా పదివేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని.. 2019-20 బడ్జెట్ లో ప్రతిపాదించినప్పటికీ అది సాధ్యం కాలేదు. న్యాయపరమైన చిక్కుముడులు వీడిన నేపథ్యంలో.. భూముల అమ్మకానికి సంబంధించి సర్కార్ మరోమారు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
పింఛన్ల వయసు తగ్గింపు
అటు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు ఉండనున్నాయి. ప్రాధాన్యతా పథకాలకు కేటాయింపులతో పాటు.. ఆయా శాఖల వారీగా వాస్తవ అవసరాల ఆధారంగా నిధులు కేటాయించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా రైతు రుణమాఫీ, వృద్ధాప్య పింఛన్ల వయసు 57ఏళ్లకు తగ్గింపు.. ఉద్యోగుల వేతన సవరణ, పదవీ విరమణ వయోపరిమితి పెంపు తదితరాలకు బడ్జెట్‌లో కేటాయింపులు ఉండే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చూడండి:డెత్ వారెంట్‌పై స్టే కోరుతూ 'నిర్భయ' దోషుల పిటిషన్