Telangana Legislative Council : తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress Party) పార్టీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టబోతోంది. ఇప్పుడు శాసనమండలి అంశం చర్చనీయాంశంగా మారింది. పెద్దల సభలో భారత రాష్ట్ర సమితికి పూర్తి ఆధిక్యం ఉండగా, శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ఒకే ఒక్క సభ్యుడు జీవన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. మండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా బీఆర్ఎస్‌కు 28 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రస్తుతం గవర్నర్ నామినేటెడ్ కోటాలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
సీఎంగా రేవంత్ రెడ్డి - రాత్రి 7 గంటలకు ప్రమాణ స్వీకారం
Congress Wins in Telangana Elections 2023 :రాష్ట్రంలో తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు పోటీచేసి గెలుపొందారు. దీంతో వారు శాసన మండలి మండలి సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. వీరిలో బీఆర్‌ఎస్(BRS) నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన శాసన సభ కోటా ఎమ్మెల్సీలైన కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్‌పూర్), పాడి కౌశిక్ రెడ్డి(హుజూరాబాద్) పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి(జనగామ) ఉన్నారు. ఇక స్థానిక సంస్థల కోటా సభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా కల్వకుర్తి నుంచి పోటీ చేసి గెలుపొందారు.