తెలంగాణ

telangana

ETV Bharat / state

TS Legislative Council Sessions 2023 : శాసనమండలిలో వర్షాలు, వరదలపై వాడీవేడిగా చర్చ - కడియం శ్రీ హరి తాజా వార్తలు

Telangana Legislative Council Sessions 2023 : శాసనమండలి సమావేశాల్లో వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాలపై మెుదలైన చర్చ సుమారు 3గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. అధికార, ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నలకు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అందించిన పరిహారం గురించి మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సమాధానమిచ్చారు. వాడీవేడిగా మెుదలైన సభ రేపటికి వాయిదా పడింది.

Telangana Legislative Council
Telangana Legislative Council

By

Published : Aug 3, 2023, 5:09 PM IST

Updated : Aug 3, 2023, 8:35 PM IST

వర్షాలు, వరదలపై శాసనమండలిలో చర్చ

Telangana Assembly Monsoon Sessions 2023 : వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారంశాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ మండలిలో ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు పోటెత్తిన వరదలకు ప్రజలకు జరిగిన పంట, ఆస్తి నష్టం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చ నడిచింది. అలాగే ఒకేసారి రైతు రుణమాఫీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఆర్టీసీ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ముఖ్యమంత్రికి మరో ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు చెప్పారు.

TS Legislative Council Sessions 2023 : మండలి సమావేశాల సందర్భంగా మాట్లాడిన డిప్యూటి స్పీకర్‌ బండ ప్రకాశ్‌.. వరదలు సంభవిస్తే ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మెుండిచేయి చూపిందని మండిపడ్డారు. రాష్ట్రానికి కేటాయించిన విపత్తులకు నిధులున్నాయని చెబుతూ కేంద్రం చేతులు దులుపుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు. దానిలో ఉన్న షరతులనెందుకు చెప్పట్లేదని కేంద్రప్రభుత్వాన్ని మండలిలో బండ ప్రకాశ్ నిలదీశారు. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతుంటే ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. కేంద్రానికి రాష్ట్రంపై ఏ మాత్రం ప్రేమ ఉన్న చేయూతనివ్వాలని కోరారు. తీవ్ర నష్టం వాటిల్లిన ఉమ్మడి వరంగల్‌ జిల్లాను రాష్ట్ర సర్కార్‌ ఆదుకోవాలని శాసనమండలి సభా వేదికగా విన్నవించారు.

MLC Jeevanreddy Comments at Legislative Council : ఇటీవల కురిసిన వర్షాలు, పోటెత్తిన వరదలతో వేలాది ఎకరాల్లో ఇసుకమేటలు వేసి రైతులు చాలా నష్టపోయారని శాసనమండలిలో విపక్షనేత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అందించే పరిహారం పెంచాలని కోరారు. గోదావరి పరివాహక ప్రాంతంలో తీవ్రనష్టం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేయని వర్గమంటూ ఏది లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ రైతుల నమ్మకాన్ని వమ్ము చేసి విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. అయినప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనైనా రైతు రుణమాఫీగుర్తుకు రావడం సంతోషకరమని తెలిపారు. రుణమాఫీ చేయడం ఆలస్యం కావడంతో వడ్డీ పెరిగిందని... ఇప్పుడు ప్రకటించిన రుణమాఫీ మొత్తం వడ్డీకే సరిపోతుందని తెలిపారు.

'వరదల వల్ల 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పంట పొలాల్లో ఇసుక మేటలతో రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. ఇసుక మేటలతో దెబ్బతిన్న రైతులకు రూ.15-20 వేల పరిహారం సరిపోదు. ఇసుక మేటలతో నష్టపోయిన రైతులకు రూ.50 వేల వరకు పరిహారం ఇవ్వాలి. వరదలతో దెబ్బతిన్న చెరువులు, కుంటలు, కాల్వలకు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. వరదలతో మత్స్యకారులు కూడా తీవ్రంగా నష్టపోయారు. రూ.కోట్ల సంపద కోల్పోయిన మత్స్యకారులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తీవ్రనష్టం జరిగింది.'-జీవన్​రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ

రేపటికి వాయిదా పడిన శాసన మండలి సమావేశాలు :వరదలబారిన పడ్డ 7వేల 870 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సర్కార్‌ వెల్లడించింది. గండ్లు పడ్డ చెరువుల పునరుద్ధరణకు 171 కోట్లు అవసరమవుతాయని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 488 రాష్ట్ర రహదారులు, 29 జాతీయ రహదారులు పునరుద్ధరించామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో యంత్రాంగం నష్టంపై అంచనా వేస్తోందని.. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన వెంటనే బాధితులందరిని ఆదుకుంటామని వెల్లడించారు.భారీ వరదల నేపథ్యంలో రాష్ట్రంలోని అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేసి తగిన జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు మంత్రి ప్రశాంత్‌రెడ్డిపేర్కొన్నారు. ఈరోజు జరిగిన మండలి సమావేశాలు శాంతియుతంగా ముగిశాయి. తిరిగి రేపు ఉదయం 10గంటలకు ప్రారంభమవుతాయని మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి :

Last Updated : Aug 3, 2023, 8:35 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details