Telangana Legislative Council New Building 2023 :రాష్ట్ర, దేశ రాజధాని నగరాల్లో తెలంగాణ ముద్ర చాటేలా శాసనమండలి, తెలంగాణ భవన్‌ల నిర్మాణానికి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ రూపకల్పన చేస్తోంది. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో ఉన్న జూబ్లీ హాల్ ప్రాంగణంలో ప్రస్తుతం శాసనమండలి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే ప్రాంగణంలో నూతన భవనాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన చేస్తోంది.
మరోవైపు 1956 నుంచి దిల్లీలోని ఏపీ భవన్ ఉమ్మడిగా సాగుతోంది. 2014లో తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పటికీ ఆస్తులు, అప్పుల పంపకం వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ పరిస్థితులలో రెండు భవనాల నిర్మాణానికి ఎదురయ్యే అడ్డంకులు, తదితరాలపై అధ్యయనం చేయాలని సర్కార్ భావిస్తోంది. రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం దిల్లీలోని ఏపీ భవన్‌లో ఖాళీ స్థలాన్ని పరిశీలించారు.
విభజన కొలిక్కి వస్తేనేదిల్లీలో ఇండియా గేట్‌కు సమీపంలోని అశోక రోడ్డులో రెండు భాగాలుగా 19 ఎకరాల విస్తీర్ణం ఏపీ భవన్ పరిధిలో ఉంది. అయితే అందులో 12 ఎకరాలు రోడ్డుకు ఒక వైపు, మరో ఏడు ఎకరాల రోడ్డుకు ఇంకో వైపు ఉన్నాయి. పోతే 12 ఎకరాల్లోనే ప్రస్తుతం భవనాలు నిర్మించి ఉన్నాయి. రెండో వైపు ఏడు ఎకరాల స్థలం ఖాళీగానే ఉంది. విభజన సమస్యలు కొలిక్కి రాకపోవడంతో ఆ భవనంలోనే వేరువేరుగా బోర్డులు ఏర్పాటు చేసుకుని రెండు ప్రభుత్వాలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఖాళీగా ఉన్న ఏడు ఎకరాల స్థలంలో తెలంగాణ భవన్ నిర్మించటం ద్వారా దేశ రాజధానిలో తెలంగాణ వైభవాన్ని చాటాలనేది కాంగ్రెస్ సర్కార్ తాజా వ్యూహం. ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో చర్చలు నిర్వహించి వ్యవహారాన్ని కొలిక్కి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ప్రతిపాదించినట్టు తెలిసింది.