KTR Met Tamilnadu IT Minister Palanivel Thaigarajan: ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఐటీ పాలసీలపైన అధ్యయనం చేసేందుకు తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ ఆధ్వర్యంలో ఒక బృందం మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనుంది. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్‌కు చేరుకున్న తమిళనాడు ఐటీ మంత్రి పీటీఆర్ బృందం మంత్రి కేటీఆర్‌తో సచివాలయంలో సమావేశం అయింది. ఈ సందర్భంగా మాట్లాడిన తమిళనాడు మంత్రి పీటీఆర్.. తెలంగాణ రాష్ట్ర ఐటీ ప్రగతిపైన, అందుకు దోహదం చేసిన అంశాలపైన అధ్యయనం చేసేందుకు తాము తెలంగాణలో పర్యటిస్తున్నామని తెలిపారు.
KTR on Telangana IT Development : ఐటీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక కార్యక్రమాలు, ఐటీ పాలసీ, ఐటీ అనుబంధ పాలసీలు, పరిశ్రమ బలోపేతం కోసం చేపట్టిన అనేక అంశాలను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో తమిళనాడు ఐటీ బృందానికి కేటీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు ఐటీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలి వెళ్తుందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగిందని... అంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి రాష్ట్ర ఐటీ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఐటీ పరిశ్రమకు అనేక విధాలుగా మద్దతు అందించడం ద్వారా దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ నగరంగా హైదరాబాద్ మారిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.