KTR on Cyber Crimes in Telangana : అవగాహన లోపం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, మోసపోతున్న వారిలో చదువుకున్న వారు, ఐటీ ఉద్యోగులు కూడా ఉండటం బాధాకరమని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సైబరాబాద్‌లో తెలంగాణ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీని ఆయన శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరా నియంత్రణకు, వేగంగా దర్యాప్తు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇది ఉపయోగపడనుంది. మైక్రోసాఫ్ట్, ఐఐటీ హైదరాబాద్, సియంట్ సంస్థల సహకారంతో పోలీసులు ఏర్పాటు చేసిన ఈ సెంటర్ దేశంలోనే మొట్ట మొదటిది కావడం విశేషం.
'సైబర్ కేటుగాళ్ల చేతిలో టెకీలు మోసపోవడం బాధాకరం' - సైబర్ నేరాలపై కేటీఆర్ కామెంట్స్
KTR on Cyber Crimes in Telangana : అమాయకత్వం, అవగాహన లోపం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మోసపోతున్న వారిలో చదువుకున్న వారు ఉండటం బాధాకరమని అన్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఉండటం మరింత శోచనీయమని పేర్కొన్నారు. సైబరాబాద్‌లో తెలంగాణ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీని మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు.
‘‘ప్రస్తుతం అంతా ఇంటర్నెట్‌తో సాగుతోంది. ప్రతి వస్తువు వైఫైతో పనిచేస్తోంది. ఇలాంటి సమయంలో సైబర్ భద్రత చాలా పెద్ద ఛాలెంజ్. సైబర్ మోసాల బారిన పడిన వాళ్లకు 1930 టోల్‌ఫ్రీ నంబరు అందుబాటులో ఉంది. కానీ, ఈ విషయం ప్రజలకు చేరట్లేదు. సైబర్ నేరాలను అరికట్టడానికి తెలంగాణ పోలీసులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. నేరాలను అరికట్టడానికి కేవలం పోలీసులే కాకుండా.. ఇతర కంపెనీలు కూడా సామాజిక బాధ్యత తీసుకోవాలి. హైదరాబాద్‌లో లక్ష మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. నేరాల బారిన పడుతున్న వారిలో చదువుకున్న వారు, ఐటీ ఉద్యోగులు ఉండటం బాధాకరం. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలను అమలు చేస్తాం. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితుల జాబితా రూపొందించాలి. ఓ ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించి అందులో నిందితుల జాబితా ఉంచాలి’’ అని మంత్రి కేటీఆర్ సూచించారు.