సేవింగ్ లైఫ్స్ విత్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే అంశంపై జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించిన గ్లోబల్ టెక్నాలజీ గవర్నమెంట్ సమ్మిట్లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. జపాన్ నుంచి నిర్వహించిన ఈ సమావేశంలో రువాండా ఐటీ శాఖా మంత్రి పౌల ఇనగంబిరే, ప్రపంచ వ్యాప్తంగా 45 ప్రముఖ వైద్య, సాంకేతిక, టెక్నాలజీ కంపెనీల అధిపతులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, ఐరోపాతో పాటు అన్ని దేశాల్లోని వైద్యరంగంలో మౌలిక వసతుల కొరతను కరోనా సంక్షోభం ఎత్తిచూపిందని తెలిపారు. వివిధ దేశాలు ఒక సహకార ధోరణితో ఈ సంక్షోభానికి అంతం పలికేందుకు ఏడాదిగా నిరంతరం శ్రమిస్తున్నాయని అన్నారు.
ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగంలో ముందున్నాం..
కరోనా లాంటి మహమ్మారిపై సాగించే పోరులో సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యంగా ఎమర్జింగ్ టెక్నాలజీల పాత్ర అత్యంత కీలకంగా మారిందని కేటీఆర్ వివరించారు. ఎమర్జింగ్ టెక్నాలజీలను వాడుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని... భూసంస్కరణలు, ఇతర పాలనా సంస్కరణల్లో సాంకేతిక పరిజ్ఞానానికి పెద్ద పీట వేసి ముందుకు పోతున్నామని వివరించారు. సమాజ క్షేమానికి దోహదపడని సాంకేతిక పరిజ్ఞానం వృథా అన్నది సీఎం కేసీఆర్ ఆలోచనా విధానమని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పౌర సేవలు, సమాజ హితానికి ఎలా వాడుకోవాలో ఎప్పటికప్పుడు సమీక్షించుకొని ముందుకెళ్తున్నామని తెలిపారు.