Telangana IT Department Annual Report 2022-23 : తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కేటీఆర్ ఇటీవలి అమెరికా పర్యటనతో రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది విడుదల చేసినట్లుగానే మంత్రి కేటీఆర్ ఈ ఏడాదీ వార్షిక నివేదికను నేడు విడుదల చేయనున్నారు. దేశానికి హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ విడుదల చేయనున్న నివేదికలు ఆయా రంగాలలో విజయాలతో పాటు కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాధాన్యతలు, లక్ష్యాలనూ వివరిస్తాయి. ఐటీ రంగం ఎగుమతులతో పాటు, ఉద్యోగ కల్పనలో గణనీయ వృద్ధిని సాధించినట్లు గత నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2021-22లో జాతీయ సగటు కంటే 9 శాతం పెరిగి ఐటీ ఎగుమతుల్లో 26.14 శాతం నమోదైంది.
Telangana IT Department Report 2023 : మంత్రి కేటీఆర్ గత నెల పర్యటన ద్వారా42 వేల మందికి ఉపాధి కల్పించే పెట్టుబడులువచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ దిగ్గజ పర్యాటక సంస్థ మాండీ హోల్డింగ్స్ త్వరలోనే రాష్ట్రంలో టెక్నాలజీ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దిగ్గజ సంస్థ అమర రాజా.. రాష్ట్రంలో స్థాపించబోయే ప్లాంటు పెట్టుబడుల్లో మైలురాయిగా నిలవనుంది. ప్రముఖ గ్లోబల్ సప్లై చైన్.. టెక్‌జెన్స్ హైదరాబాద్‌లో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రంలో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, డిజైన్ థింకింగ్‌పై దృష్టి సారించనుంది.
వేలాది మందికి ఉపాధి..: డిజిటల్ సొల్యూషన్స్ రంగంలో అగ్రగామి అయిన రైట్ సాఫ్ట్‌వేర్ సంస్థ రాష్ట్రంలోని ప్రముఖ విద్యా సంస్థలకు సహకరిస్తూ.. సరికొత్త అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. జూన్ 30న మంత్రి కేటీఆర్ ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ప్రముఖ గేర్ల ఉత్పత్రి సంస్థ రేవ్‌గేర్స్ బృందంతో మంత్రి కేటీఆర్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆయా సంస్థల ద్వారా రాష్ట్రంలో వేలాది మందికి ఉద్యోగ కల్పనతో పాటు ఎగుమతులు, సాంకేతిక అభివృద్ధి జరగనుంది. మరో కంపెనీ స్టోరెబుల్ కార్యకలాపాల విస్తరణతో పాటు స్థానికులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్-(టాస్క్)తో కలిసి పని చేయనుంది.