Telangana Irrigation Secretary issue : నీటి పారుదల శాఖ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకం. ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాల్వలు, సొరంగాలు, పంప్ హౌస్లు, జలాశయాలు ఇలా భారీ నిర్మాణాలు చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయి. నీటి పారుదల శాఖ వద్ద ఉండే ఆస్తుల సంఖ్య, వాటి విలువ కూడా భారీగానే ఉంటుంది. క్షేత్రస్థాయి విధి నిర్వహణ, పర్యవేక్షణతో పాటు పాలనా సంబంధితంగా ఎంతో మంది ఇంజినీర్లు, అధికారులు నీటి పారుదల శాఖలో ఉంటారు.
పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి రూ.58 వేల కోట్లు అవసరం - కాళేశ్వరానికి కావాల్సింది రూ.17,852 కోట్లు
Telangana Irrigation Department Officers : సాంకేతిక అంశాలతో పాటు పాలనా పరమైన అంశాల పర్యవేక్షణ కోసం ఈఎన్సీ వరకు వివిధ స్థాయిలో ఇంజినీర్లు ఉంటారు. వందలాది మంది ఇంజినీర్లు విధుల్లో ఉంటారు. ఈ వ్యవస్థ అంతా శాఖాధిపతి హెచ్ఓడీకి సంబంధించి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిపాలనా అనుమతుల పర్యవేక్షణ, నిధుల విడుదల, ఉత్తర్వుల జారీకి సంబంధించి అన్ని శాఖల్లాగే నీటి పారుదల శాఖకు కూడా కార్యదర్శి ఉంటారు. శాఖకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా సీనియర్ ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగిస్తారు. ఒక్కోమారు ఇద్దరిని కూడా నియమిస్తుంటారు. అయితే ప్రస్తుతం నీటి పారుదల శాఖలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కీలకమైన ఈ శాఖకు కార్యదర్శి ఉన్నారా లేదా అన్న స్థితి నెలకొంది.
Irrigation Department : నీటి పారుదల శాఖప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ గత నెల 30న పదవీ విరమణ చేశారు. దీంతో అప్పుడు ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న స్మితా సభర్వాల్కు నీటి పారుదల శాఖ బాధ్యతలు అదనంగా అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈలోగా రాష్ట్రంలో ఎన్నికల అనంతరం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. నీటి పారుదల శాఖను సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు.