Telangana Irrigation Budget 2024 :రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు ప్రారంభమైంది. 2024 -25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం ఆర్థికశాఖ ఇప్పటికే అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తోంది. మరోసారి భారీగానే నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. దాదాపు రూ.40 వేల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు తయారైనట్లు సమాచారం. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉన్నట్లుగానే ఈ ఏడాది కూడా నీటిపారుదల ప్రాజెక్టుల కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపులే ఎక్కువగా ఉండనున్నాయి. అసలు, వడ్డీ చెల్లింపులు కలిసి రూ.19 వేల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా.
Telangana Irrigation Projects Budget 2024 :ఇక మిగిలిన రూ.21 వేల కోట్లను ప్రాజెక్టుల పనులకు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన పరిస్థితుల్లో ఇపుడు ఏ విధానాన్ని అనుసరిస్తారన్నది చూడాల్సి ఉంటుంది. అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే ప్రాజెక్టుల పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సీతారామ, చిన్న కాళేశ్వరం, ఎస్ఎల్బీసీ, ఉదయ సముద్రం, గౌరవెళ్లి తదితర ప్రాజెక్టులకు ప్రాధాన్యం దక్కవచ్చని సమాచారం.
ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించి కూడా సర్కార్ బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే 75 శాతానికి పైగా పనులు పూర్తయిన ప్రాజెక్టుల్లో మిగిలిన పనుల పూర్తి కోసం నిధులు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కృష్ణా బేసిన్‌లో కల్వకుర్తి ఎత్తిపోతలకు మరో రూ.377 కోట్లు ఖర్చు చేస్తే లక్షా 44 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. నెట్టెంపాడుకు రూ.250 కోట్ల వ్యయంతో 58 వేల ఎకరాలకు కొత్తగా నీరు ఇచ్చే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ రూ.4 వేల 915 కోట్లు ఖర్చు చేస్తే లక్షా 27 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. బీమా ఎత్తిపోతలకు రూ.194 కోట్లు వ్యయం చేస్తే అదనంగా 45 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. కోయిల్ సాగర్‌కు మరో రూ.150 కోట్లు ఖర్చు చేస్తే 15 వేల ఎకరాల అదనపు ఆయకట్టు రానుంది.
బతికుండగా పరిహారం వచ్చేనా - 15ఏళ్లుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు బాధితుల గోస
Telangana Irrigation Projects :గోదావరి బేసిన్‌లో ఇందిరమ్మ వరద కాల్వ పనులకు రూ.1,718 కోట్లు ఖర్చు చేస్తే 2 లక్షల ఆరు వేల ఎకరాలకు నీరు ఇవ్వవచ్చు. దేవాదుల ఎత్తిపోతలకు రూ.3 వేల 346 కోట్లు ఖర్చు చేస్తే 2 లక్షల నాలుగు వేల ఎకరాల ఆయకట్టు వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.34 వేల కోట్లు ఖర్చు చేస్తే 18 లక్షల 65 వేల ఎకరాలకు నీరు అందనుంది. శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి ఎత్తిపోతలకు రూ.2 వేల 875 కోట్లు వ్యయం చేస్తే లక్షా తొమ్మిది వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. ఎస్సారెస్పీ రెండో దశ కింద రూ.67 కోట్లు ఖర్చు చేస్తే 17 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.