English Practicals in Intermediate : ఈ ఏడాది కొత్త విద్యాసంవత్సరంలో పలు సంస్కరణలు అమలుచేయాలని.. గత నవంబరులో తెలంగాణ ఇంటర్ బోర్డు పాలకమండలి నిర్ణయం తీసుకొంది. అందులో ఒకటైన ఇంగ్లిషు సబ్జెక్టులో ప్రాక్టికల్స్.. అమలుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు ఉండనుండగా.. రాత పరీక్ష 80 మార్కులకే పరిమితం కానుంది. ఆంగ్లంలో సంభాషించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని, దానివల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రాక్టికల్స్‌కు సిలబస్ కూర్పుపై భాషా నిపుణులతో బోర్డు అధికారుల చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయి. దీనిలో విద్యార్థులను దైనందిన జీవితంలో ఎదురయ్యే వివిధ సందర్భాలు చెప్పి ఆంగ్లంలో ఎలా మాట్లాడతారో పరీక్షించి అందుకు తగ్గట్లుగా ఆంగ్ల నిపుణులు మాడ్యూళ్లు రూపొందిస్తున్నారు. ఆపై పుస్తకాలనూ ముద్రించాలని భావిస్తున్నారు. పీజీ, పీహెచ్‌డీ విద్యార్థుల 'వైవా' తరహాలోనే పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు.
పాత సిలబస్‌తోనే పాఠాలు : ఇంటర్ మొదటి సంవత్సరం తరగతలు ప్రారంభమయ్యే నాటికి ప్రాక్టికల్స్‌పై ఇంటర్మీడియట్ బోర్జు నిర్ణయం ప్రకటించనుంది. ఇంటర్‌లో ద్వితీయ భాషా సబ్జెక్టులైన తెలుగు, సంస్కృతం, హిందీ సిలబస్‌ను ప్రస్తుతానికి పాతదాని ప్రకారమే బోధించనున్నారు. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా భాషా విధానం మారడంతో.. రానున్న విద్యాసంవత్సరం భాషా సబ్జెక్టులకు కొత్త సిలబస్ రావొచ్చని అధికారులు అంచనా వేశారు. కానీ ఈ ఏడాది ఇక్కడ మార్పు చేస్తే ఇబ్బంది అవుతుందని బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్‌కు నిపుణలు సూచించినట్లు సమాచారం. దీంతో పాత సిలబస్‌నే ముద్రిస్తున్నారు.