రాష్ట్రంలో ‘రూర్బన్ మిషన్’ అమలుకు మరిన్ని గ్రామాలు ఎంపికయ్యే అవకాశం ఉంది. గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చి, వాటిని పట్టణాలకు దీటుగా తయారు చేయడం ఈ పథకం లక్ష్యం. అమలులో రాష్ట్రం 4వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో కేంద్రం మరిన్ని గ్రామాలకు ఈ పథకాన్ని విస్తరించే అవకాశం ఉందని సమాచారం.
60:40 నిష్పత్తిలో నిధులు
మైదాన ప్రాంతాల్లో 25 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న పక్కపక్క గ్రామాలను క్లస్టర్‌గా గుర్తించి, అక్కడ అభివృద్ధి పనులకు కేంద్రం రూ.30 కోట్ల వరకు ఇస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో 5 వేల నుంచి 15 వేల వరకు జనాభా ఉన్న క్లస్టర్‌కు రూ.15 కోట్ల వరకు కేటాయిస్తోంది. కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తిలో నిధులు వెచ్చిస్తాయి.
2019-20లో రూర్బన్ కింద రూ.252 కోట్లు
తెలంగాణలో 5 గిరిజన క్లస్టర్లు సహా మొత్తం 16 క్లస్టర్లు ఈ పథకంలో ఎంపికయ్యాయి. కొన్ని పనులూ పూర్తయ్యాయి. ప్రధానంగా గోదాముల నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటు, పారిశుద్ధ్యం మెరుగుపరచటం, రోడ్లపై డివైడర్లు, ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు, అంతర్గత రోడ్ల అనుసంధానం వంటి పనులు చేపట్టారు. ప్రస్తుత 2019-20లో రూర్బన్ కింద రూ.252 కోట్లు వ్యయం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.