అక్షరాలా రూ. లక్ష కోట్లు.. ఇదీ రాష్ట్రంలో స్థిరాస్తి లావాదేవీల విలువ! - తెలంగాణ స్థిరాస్తి విలువ భారీగా
Telangana Immovable Property Value Increased: రాష్ట్రంలో స్థిరాస్తి(ఇళ్ల స్థలాలు, ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్‌మెంట్ ఫ్లాట్లు) అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువైన స్థిరాస్తుల క్రయవిక్రయాలు నమోదయ్యాయి. గత ఆరేళ్లలో ఇవి రెట్టింపు కావడం విశేషం. ఈ లావాదేవీల్లో హెచ్‌ఎండీఏ అగ్రస్థానంలో ఉంది.
telanagana property value increased
By
Published : Jul 25, 2022, 3:45 AM IST
Telangana Immovable Property Value Increased: రాష్ట్రంలో స్థిరాస్తి లావాదేవీలు భారీగా పెరిగాయి. ఇళ్ల స్థలాలు (ప్లాట్లు), ఇళ్లు, అపార్ట్‌మెంట్ ఫ్లాట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువైన స్థిరాస్తుల క్రయవిక్రయాలు నమోదయ్యాయి. గత ఆరేళ్లలో ఇవి రెట్టింపు కావడం విశేషం. ఈ లావాదేవీల్లో హెచ్‌ఎండీఏ అగ్రస్థానంలో ఉంది. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల రాబడిలో మూడో వంతు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వస్తుండటం విశేషం. రాష్ట్ర స్థిరాస్తి రంగంలో 80 శాతం హైదరాబాద్ చుట్టుపక్కలే కేంద్రీకృతమైంది.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విశ్లేషణ ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో 7.46 లక్షల ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్ల క్రయవిక్రయాలు జరగ్గా వీటి విలువ రూ.1.05 లక్షల కోట్లు. వీటి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.7,560 కోç్ల ఆదాయం సమకూరింది. ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ కంటే 45 శాతం ఎక్కువ మొత్తానికి రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. ఇళ్ల స్థలాలకు సంబంధించి.. ప్రభుత్వం నిర్ణయించిన విలువకు, వాస్తవ విలువకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ లెక్కన అనధికారికంగా ఈ లావాదేవీల విలువ చాలా భారీగా ఉంటుందని అంచనా.
ఆరేళ్లలో వ్యవసాయేతర ఆస్తుల క్రయవిక్రయాలు దాదాపు రెట్టింపు కాగా.. ప్రభుత్వ రాబడి మూడింతలు పెరగడం విశేషం. 2020-21లో కొవిడ్- లాక్‌డౌన్‌ల ప్రభావం వల్ల రిజిస్ట్రేషన్లు మందగించగా, ఆ తర్వాత ఏడాది (2021-22)లో రికార్డుస్థాయిలో లావాదేవీలు పెరిగాయి. క్రయవిక్రయాల్లో ఇళ్ల స్థలాలు అత్యధికంగా ఉండగా, తర్వాతి స్థానాల్లో ఇళ్లు, ఫ్లాట్లు ఉన్నాయి. మొత్తంగా రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.9,237 కోట్ల రాబడి వచ్చింది. ఇందులో ఇళ్ల స్థలాలు, ఇళ్లు, ఫ్లాట్ల క్రయ, విక్రయాల ద్వారా రూ.7,560 కోట్లు సమకూరింది. బహుమతి, సెటిల్‌మెంట్, జీపీఏ, ఇతర అంశాల ద్వారా మిగిలిన ఆదాయం సమకూరింది. సంఖ్య తక్కువైనా.. ఫ్లాట్ల అమ్మకాలతోనే సర్కారుకు అత్యధికంగా రూ.2,841 కోట్ల ఆదాయం వచ్చింది. అనధికారిక లేఅవుట్లలో ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్)కు 25 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి.
హెచ్‌ఎండీఏ పరిధిలోనే అత్యధికం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని హెచ్‌ఎండీఏ ప్రాంతాల్లో స్థిరాస్తి లావాదేవీలు అత్యధికంగా జరుగుతున్నాయి. ఆస్తుల విలువతో పాటు లావాదేవీల సంఖ్యపరంగా కూడా హెచ్‌ఎండీఏ ప్రాంతం ఎంతో ముందుంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ఒక్క హెచ్‌ఎండీఏ పరిధిలోనే 80 శాతం రాబడి జమ అయ్యింది. ఇతర ప్రాంతాల నుంచి మిగిలిన 20 శాతం వచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తుల క్రయవిక్రయాల సంఖ్య భారీగా పెరగకున్నా.. వీటి ద్వారా రాబడి మాత్రం గణనీయంగా పెరుగుతోంది. రిజిస్ట్రేషన్ల ఆదాయం ఆరేళ్లలో దాదాపు 150 శాతం వరకు పెరిగింది. రిజిస్ట్రేషన్ శాఖకు 2016-17లో రూ.1,401 కోట్ల రాబడి రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,378 కోట్లు వచ్చింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల రాబడిలో సుమారు 36 శాతం కావడం గమనార్హం.