TS HighCourt on Revanth Security: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్రకు అదనపు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదనపు భద్రత కల్పించాలని కోరుతూ రేవంత్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం మరోసారి విచారణ జరిగింది. తగిన భద్రత లేకపోవడం వల్ల పాదయాత్రలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని... ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ముప్పు ఉందని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది తెలిపారు.
రేవంత్‌రెడ్డి పాదయాత్రకు ఇప్పటికే 69 మందితో భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది వివరించారు. అయితే ఆ భద్రత అంతా ట్రాఫిక్ నియంత్రణకే ఉంటోందని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి భద్రత పెంచాలని స్పష్టం చేసింది. పాదయాత్రతో పాటు రేవంత్‌రెడ్డి రాత్రి బస చేసే ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకు యాత్రకు పెరుగుతున్న ఆదరణతో మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు నూతనోత్సాహంతో పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే వారం రోజుల క్రితం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర అనంతరం భూపాలపల్లి వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్ వద్ద ఉద్రిక్తత నెలకొని ఉద్రిక్తంగా మారింది.