HC on Hyderabad Exhibition: హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ నిర్వహణకు అనుమతిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 2019లో ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు న్యాయవాది ఐజాజుద్దీన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజే జస్టిస్ సతీశ్ చంద్ర ధర్మాసనం విచారణ చేపట్టింది. జనవరి 1 నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నిర్వహించేందుకు అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చాయని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి హైకోర్టుకు నివేదించారు.
అయితే అనుమతిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కొవిడ్ మార్గదర్శకాలు, నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా ఉండాలని ప్రభుత్వానికి హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్న తర్వాత విచారణ చేపడతామని వాయిదా వేసింది.