TS High Court on Facilities in Govt Educational Institutions: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో వసతులు మెరుగుపరిచేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని సర్కార్‌ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనీస వసతులు లేవంటూ ఎల్‌ఎల్‌బీ విద్యార్థి మణిదీప్ రాసిన లేఖను సుమోటో పిల్‌గా హైకోర్టు స్వీకరించింది. దానిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో తీసుకుంటున్న మౌలిక వసతులపై మండిపడింది.
సరూర్ నగర్ ప్రభుత్వ కాలేజీలో 700 మంది విద్యార్థినులకు ఒకే మూత్రశాల ఉండటంపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో అమ్మాయిలకు తగిన మౌలిక వసతులు కల్పించాలని వ్యాఖ్యానించింది. సరూర్‌నగర్ కాలేజీతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో వసతులపై ఏప్రిల్ 25లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్ బోర్డు కమిషనర్‌కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఇకనైన ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి.