CJI Justice NV Ramana: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ హైకోర్టులో తొలిసారి సన్మానం జరిగింది. నాలుగు రోజుల సెలవులో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయనను తెలంగాణ బార్ కౌన్సిల్, అడ్వకేట్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఆయనను హైకోర్టు ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు. ఈ సన్మానంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్ చంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. సన్మానానికి ముందు హైకోర్టులో కలియదిరిగిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ భావోద్వేగానికి లోనయ్యారు. 11ఏళ్ల పాటు పలు హోదాల్లో అక్కడ పనిచేసిన ఆయన.. అప్పటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. దిల్లీకి రాజైనా తల్లికి బిడ్డేనన్న సీజేఐ... హైకోర్టుకు వస్తే తల్లి ఒడిలో ఉన్నట్లు ఉందన్నారు. న్యాయవాదిగా ఉన్ననాటి రోజులు.. కేసులు లేనపుడు ఖాళీగా కూర్చున్న రోజులు, అప్పట్లో సిద్దయ్య క్యాంటీన్లో టీ తాగిన రోజులు ఇవాళ నెమరువేసుకున్నారు. హైకోర్టు నుంచి ఎంతో నేర్చుకున్నానన్న ఆయన.. రుణం తీర్చుకునేందుకు శ్రమిస్తానన్నారు.
రెండు విషయాలు చాలా కీలకం.. ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత సామాన్యుడికి న్యాయం చేకూరడానికి రెండు విషయాలు చాలా కీలకమని గమనించినట్లు జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. కోర్టులు అందుబాటులో ఉండటం, వాటిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం చాలా కీలకమన్నారు. ఇందుకోసం జ్యుడీషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడమే తరువాయి అన్నారు. మరో వైపు జడ్జిల సంఖ్య తక్కువగా ఉండటంతో సామాన్యుడికి సత్వర న్యాయం జరగడం లేదని.. అందుకే జడ్జిల నియామకానికి పెద్దపీట వేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1100 మంది హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారని... ఇంకా 400 ఖాళీలు ఉన్నాయన్నారు. మే నెలాఖరు వరకూ మరో 200 మంది జడ్జిల నియామకం పూర్తి అవుతుందని వెల్లడించారు. తెలంగాణ హైకోర్టులో 24 మంది జడ్జిలు ఉంటే ఆ సంఖ్యను 42 చేశామని గుర్తుచేశారు. ఇంకా మరి కొన్ని ఖాళీలు ఉన్నాయని.. ప్రధాన న్యాయమూర్తి, కొలీజియం మెంబర్లు పేర్లు సూచిస్తే వాటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
న్యాయవాదులను ఆదుకోవాలి.. తెలంగాణ రాష్ట్రంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారన్న ఆయన.. సబార్డినేట్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు తనతో చెప్పారన్నారు. కొన్ని కోర్టులకు కూడా కొత్త భవనాలు నిర్మిస్తున్నామని కేసీఆర్ చెప్పారని వెల్లడించారు. సహకారం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సీజేఐ కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని.. కొందరు వృత్తినే మానేసే పరిస్థితికి వచ్చారని అన్నారు. కొవిడ్ వల్ల వారు ఎంతో నష్టపోయారని.. వారిని ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరామన్నారు. సీనియర్ న్యాయవాదులు వారిని పెద్ద మనసుతో ఆదుకోవాలని సూచించారు. న్యాయవాదులకు శిక్షణ కోసం అకాడమీ అవసరం ఉందన్న సీజేఐ.. కొత్తగా వృత్తిలోకి వచ్చిన న్యాయవాదులకు వసతి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందు కోసం శ్రమిస్తామన్నారు.