Plaster Of Paris Idols: వినాయక చవితి అంటేనే రంగుల రంగుల విగ్రహాలు... ఆకట్టుకునే రూపాలు. నవరాత్రులు... ధగధగ మెరిసిపోయే గణనాథుల తయారీలో విగ్రహాల తయారీదారుల కష్టం దాగుంది. భక్తులను ఆకట్టుకునే విధంగా తయారు చేసే విగ్రహాల్లో వీరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినియోగిస్తుంటారు. వినాయక చవితి సమీపిస్తుండడంతో ఏటా విగ్రహాల తయారీదారులు ఎంతో బిజీబిజీగా గణేశ్ ప్రతిమల తయారీలో నిమగ్నమైపోయేవారు. కానీ వినాయక విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడకాన్ని హైకోర్టు గతేడాది నిషేధించింది. దీంతో విగ్రహాల తయారీదారుల గుండె గుభేల్ మంది. ఇటీవల కోర్టు, మేకర్స్‌కు మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. అయితే విజయవాడ జాతీయ రహదారి పక్కన హయత్‌నగర్, పెద్ద అంబర్పేట్ పరిధిలో 40, 50 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్న వారు నిషేధంతో తాము జీవనోపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లాక్డౌన్ నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా పిల్లలను కూడా పోషించుకోలేని స్థితిలో ఉన్నాం. నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. రెండేళ్ల నుంచి సరైన పనిలేక నష్టాల్లో ఉన్నాం. ప్రభుత్వం చెబుతోంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో విగ్రహాలను చేయొద్దని. కానీ మాకు మట్టితో గణేశ్ విగ్రహాలను తయారు చేయడం రాదు. మాకు రెండు, మూడేళ్ల సమయం ఇస్తే... మట్టి విగ్రహాలను తయారు చేయడం నేర్చుకుంటాం. -- సవీలాల్
ఇప్పటికే చితికిపోయాం: ఇప్పటికే రెండు, మూడు సంవత్సరాలుగా కొవిడ్‌తో ఆర్థికంగా చితికిపోయామని విగ్రహ తయారీదారులు వాపోయారు. ఇప్పుడిప్పుడే కోలుకుని వినాయక విగ్రహాలను తయారు చేస్తుంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడకాన్ని కోర్టు నిషేధించడం పట్ల ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమకు వచ్చిన పని ఇది ఒక్కటేనని... గత యాభై, అరవై సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నామన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ పనిపై నిషేధం విధిస్తే తాము ఎలా బతకాలని తయారీదారులు అర్థిస్తున్నారు.
ఏళ్లతరబడిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో విగ్రహాలను తయారు చేస్తున్నాం. కానీ ప్రభుత్వం ఈ మధ్య మట్టితో విగ్రహాలను తయారు చేయమని చెబుతోంది. మాకు మట్టితో విగ్రహాలను తయారు చేయడం రాదు. వేరే పనులు చేసుకోవాలన్న మాకు రావు. చిన్నచిన్న పిల్లలు ఉన్నారు. వారిని ఏం పెట్టి పోషించాలి.-- కన్నయ్య