HC on Registrations: స్టాంపు డ్యూటీ చెల్లించి పొందిన వాలిడేట్ డాక్యుమెంట్ ద్వారా.. రిజిస్ట్రేషన్లు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. వాలిడేట్ పత్రం ద్వారా రిజిస్ట్రేషన్లు చేయరాదని.. రిజిస్ట్రేషన్ల ఐజీ 2008లో జారీ చేసిన సర్క్యులర్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. స్టాంపు డ్యూటీ చట్టం ద్వారా పొందిన ధ్రువీకరణ పత్రాన్ని లింక్ డాక్యుమెంటుగా పరిగణించాలని తెలిపింది. రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఉద్దేశం ప్రజాప్రయోజనాల కోసమే అయినా.. చట్ట సవరణలు లేకుండా కేవలం సర్క్యులర్ ద్వారా మార్పులు చేర్పులు చేయలేరని తెలిపింది.
ఆదాయం వచ్చినా ఆచరణలో సమస్యలు: అయితే వాలిడేట్ డాక్యుమెంట్ ద్వారా.. రిజిస్ట్రేషన్లు చేస్తే వివాదాలు తలెత్తుతాయనడంలో ఎలాంటి అనుమానం లేదని హైకోర్టు పేర్కొంది. రిజిస్ట్రేషన్ల చట్టంలోని లోపాలతో.. ప్రజలు నష్టపోతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం అవసరమైన పత్రాలు తీసుకొస్తే.. సబ్‌రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని స్పష్టంచేసింది. స్టాంపు డ్యూటీ వసూలు చేసి రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల.. ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది కానీ.. ఆచరణలో సమస్యలు తలెత్తుతున్నాయని.. పలు సందర్భాల్లో ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోందని హైకోర్టు పేర్కొంది.