Agri Gold and Akshaya Gold cases: తెలంగాణ హైకోర్టులో ఏడేళ్లుగా విచారణ జరుగుతున్న అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసుల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్‌కు సంబంధించిన వ్యాజ్యాలన్నింటినీ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. ఏపీలోని ఏలూరు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. వీటికి సంబంధించిన 42 వ్యాజ్యాలపై విచారణ ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసులన్నీ ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని గతంలో ఏపీ ప్రభుత్వం కోరింది. ఏపీ డిపాజిటర్ల రక్షణ చట్టం ప్రకారం ఏలూరు జిల్లా కోర్టుకు విచారణ పరిధి ఉందని గతంలో కౌంటర్ దాఖలు చేసింది.
డిపాజిట్లకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక కోర్టు ఉన్నప్పుడు హైకోర్టుకు విచారణ పరిధి ఉండదని ధర్మాసనం పేర్కొంది. కేసులతో పాటు భూముల వేలంలో వచ్చిన 50 కోట్ల రూపాయలనూ ఏలూరు కోర్టుకు బదిలీ చేయాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. వివిధ అంశాలు ముడిపడి ఉన్నందున తెలంగాణ హైకోర్టులోనే విచారణ కొనసాగించాలన్న డిపాజిటర్లు, వివిధ బ్యాంకర్ల అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని ఏలూరు కోర్టుకు ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇదీ అగ్రిగోల్డ్ వ్యవహారం..
అగ్రిగోల్డ్ యాజమాన్యం.. ఆకర్షణీయ పథకాలతో దాదాపు 32 లక్షల మంది డిపాజిట్‌దారులను మభ్యపెట్టి దాదాపు రూ.6,380 కోట్లను సేకరించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఈ సంస్థ ఏడు రాష్ట్రాల్లో డిపాజిట్లు సేకరించినట్లు ఈడీ గుర్తించింది. స్థిరాస్తి వ్యాపారం పేరిట ఏజెంట్లను చేర్చుకున్న సంస్థ.. వారి ద్వారా పెద్దఎత్తున డిపాజిట్లను సేకరించింది. డిపాజిటర్ల పేరిట కేటాయించినట్లు చెప్పిన ప్లాట్లకు హద్దులు నిర్ణయించకుండా, లొకేషన్ చెప్పకుండా, వాస్తవ మార్కెట్ విలువ ప్రస్తావించకుండా, సర్వే నంబర్లు వెల్లడించకుండా మాయ చేసింది.
పేరుకే స్థిరాస్తి వ్యాపారమని చెప్పినా.. ఆర్‌బీఐ నుంచి అనుమతులు లేకుండానే డిపాజిట్లు సేకరించింది. ఈ నిర్వాకాన్ని గుర్తించిన సెబీ వెంటనే వ్యాపార కార్యకలాపాల్ని అపేసి డిపాజిట్‌దారులకు సొమ్ము తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. దాన్ని పట్టించుకోని ఛైర్మన్ అవ్వ వెంకట రామారావు.. కొత్త కంపెనీలను తెరపైకి తెచ్చి కమీషన్ ఏజెంట్ల ద్వారా భారీగా డిపాజిట్లు సేకరించారు. ప్రక్రియ కాస్తా పొంజి స్కామ్‌గా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో ప్లాట్లు ఇస్తామంటూ 32లక్షల మంది నుంచి తీసుకున్న సొమ్ముకు చివరకు దాదాపు 5.3లక్షల ప్లాట్లు మాత్రమే వెంచర్లలో ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.
ఇదీచూడండి:డబ్బులు బాగా అవసరమా? హోంలోన్ టాపప్ చేయండి!