రాష్ట్రంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నందున ఐసీఎంఆర్ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా కేసులు ఎక్కువగా వచ్చే ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సూచించించి. రోజూ 50 వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు తెలిపింది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని, పాఠశాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
'రోజూ 50 వేల కొవిడ్ పరీక్షలు నిర్వహించాలి' - ts high court news
కరోనా కేసులు పెరుగుతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఐసీఎంఆర్ మార్గనిర్దేశాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోజూ 50 వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లు చేయాలని తెలిపింది. వేడుకల్లో 100 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనకుండా నిబంధన అమలు చేయాలని కోరింది.
హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని.. రోజూ 50 వేల పరీక్షలు నిర్వహించడం లేదని చిక్కుడు ప్రభాకర్ వాదించారు. ఈ నెల 7, 11, 12, 13 తేదీల్లో వైద్యఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్లలోనే 50 వేల పరీక్షలు నిర్వహించినట్లు లేదన్నారు. ఆ అంశం కోర్టు ధిక్కరణగా పరిగణించాలని ప్రభాకర్ కోరారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోనూ, పోలింగ్ రోజు కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్ల.. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. హోలీ పండగ కూడా రాబోతోందని.. ఈ నేపథ్యంలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతిరోజూ బులిటెన్ విడుదల చేస్తున్నామని, హైకోర్టు ఆదేశాలన్నింటిని పాటిస్తున్నామని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్.. హైకోర్టుకు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం ఏప్రిల్ 7కు విచారణను వాయిదా వేసింది.
ఇదీ చూడండి :తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతుంది: హరీశ్