తెలంగాణ

telangana

ETV Bharat / state

'అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరించేందుకే ఎల్​ఆర్​ఎస్​'

చట్టపరమైన అధికారాలతోనే అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేపట్టినట్లు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. రిజిస్ట్రేషన్లను నిషేధించే అధికారం తమకుందన్న సర్కారు... ఎల్​ఆర్​ఎస్​ ఉద్దేశం పట్టణాలు, పంచాయతీల్లో ప్రణాళికబద్ధమైన అభివృద్ధేనని వివరించింది. దీనికింద వచ్చే నిధులు ప్రత్యేక ఖాతాలో జమ చేసి.. మౌలిక వసతుల కల్పనకు వినియోగిస్తామని ధర్మాసనానికి వివరించింది.

'అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరించేందుకే ఎల్​ఆర్​ఎస్​'
'అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరించేందుకే ఎల్​ఆర్​ఎస్​'

By

Published : Oct 23, 2020, 5:35 AM IST

'అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరించేందుకే ఎల్​ఆర్​ఎస్​'

ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసమే అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేపట్టినట్లు హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఎల్​ఆర్​ఎస్​ను సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై... ప్రభుత్వం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కౌంటరు దాఖలు చేశారు. కఠిన చట్టాలు లేకపోవడం వల్లనే అనధికార లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయని.. ప్రస్తుతం అవి అభివృద్ధి, సదుపాయాల కల్పనకు అడ్డంకిగా మారాయని సర్కారు పేర్కొంది. ప్రజలకు ఒక అవకాశం ఇచ్చి మార్పు తేవడంతోపాటు.. భవిష్యత్‌లో అనధికార లేఅవుట్లను నిరోధించే ఉద్దేశంతోనే ఎల్​ఆర్​ఎస్​ను రూపొందించినట్లు కౌంటర్‌లో తెలిపింది. అనధికార లేఅవుట్లలో ఇకపై రిజిస్ట్రేషన్లు, భవన నిర్మాణ అనుమతులు ఉండబోవని స్పష్టం చేసింది. గతంలోనూ రెండు సార్లు క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చినట్లు తెలిపింది. అనధికార లేఅవుట్లను నిరోధించేందుకే రిజిస్ట్రేషన్లను నిలిపివేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక నుంచి డాక్యుమెంట్లతో పాటు లేఅవుట్ అనుమతి పత్రం సమర్పిస్తేనే రిజిస్ట్రేషన్లు ఉంటాయని వివరించింది. క్రమబద్ధీకరణ కోసం 2015లో 3 లక్షల 80వేల దరఖాస్తులు రాగా.. సుమారు 2 లక్షల 80వేలు క్రమబద్ధీకరించినట్లు వివరించింది.

మౌలిక వసతుల కల్పన కోసమే..

ఎల్​ఆర్​ఎస్​ ఛార్జీల ద్వారా వచ్చే సొమ్మును ప్రత్యేక ఖాతాలో జమ చేసి.. మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించనున్నట్లు పేర్కొంది. అనధికార లేఅవుట్లపై గతంలో చర్యలు తీసుకోలేదని పిటిషనర్ పేర్కొనడం సరికాదని.. గతేడాది 715 లేఅవుట్లపై హెచ్​ఎండీఏ చర్యలు తీసుకుందని వివరించింది. రాష్ట్ర విభజన తర్వాతే అనధికార లేఅవుట్లు పెరిగాయనడం సరికాదని... సుమారు 90శాతం దరఖాస్తులు 2014కి ముందు లేఅవుట్లలోనివేనని స్పష్టం చేసింది. ఎల్​ఆర్​ఎస్​కు ప్రజల నుంచి మంచి స్పందన ఉందని.. సుమారు 20 లక్షల 44వేల దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది.

దరఖాస్తుల వెల్లువ

రాష్ట్రంలో ఎల్​ఆర్​ఎస్​కు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. 22వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 21.43 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గ్రామపంచాయతీల నుంచి 8,94,000 వేలు... పురపాలికల నుంచి 8,91,000, నగరపాలకసంస్థల నుంచి 3,57,000 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:వరద వల్ల భారీ నష్టం... ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ABOUT THE AUTHOR

...view details