No Permision For Rides In Margadarsi Head Office : హైదరాబాద్‌లోని మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో సోదాలకు సంబంధించి ఏపీలోని విజయవాడ జిల్లా సబ్ రిజిస్ట్రార్ ఈ నెల 13న జారీ చేసిన వారెంట్‌ను తెలంగాణ హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై.. జస్టిస్ ముమ్మనేని సుధీర్‌కుమార్ విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మార్గదర్శి చందాదారుల పేర్లు, ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లను అధికారులు అడిగారని, ఇది చందాదారుల వ్యక్తిగత సమాచారమే కాకుండా, మార్గదర్శికి చెందిన.. మేధో సంపత్తి ఆస్తి అని న్యాయమూర్తి పేర్కొన్నారు. అధికారులు ప్రొసీడింగ్స్ జారీ చేసే ముందు.. ఒక చిట్, లేదా చిట్ గ్రూపులో ఏదైనా అక్రమం.. చట్ట ఉల్లంఘన ఉన్నాయని పేర్కొన లేదన్నారు.
చిట్‌ఫండ్ చట్టం సెక్షన్ 82 ప్రకారం చట్టానికి భిన్నంగా ఉన్నట్లు ఏదైనా అనుమానం ఉంటే రిజిస్ట్రార్ గానీ, ఆయన తరఫున అధీకృత వ్యక్తి గానీ.. సోదాలు నిర్వహించి, అనుమానం ఉన్న పత్రాలు, పుస్తకాలు, రిజిస్టర్లు సీజ్ చేయడానికి రాతపూర్వకంగా కారణాలు తెలపాలని వివరించారు. కానీ రిజిస్ట్రార్ ఇచ్చిన నోటీసులో.. ఎలాంటి కారణాన్నీ పేర్కొన లేదన్నారు. హైదరాబాద్ కార్యాలయంలో వివరాలను రహస్యంగా ఉంచారనే అనుమానంతో ప్రొసీడింగ్స్ జారీ చేశారన్నారు. ప్రాథమికంగా పరిశీలిస్తే.. సోదాల కోసం వారెంట్ జారీ చేయడానికి రాతపూర్వకంగా కారణాలు నమోదు చేయలేదని పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌ను విచారించే పరిధిపై న్యాయమూర్తి ప్రాథమికంగా సందేహం వ్యక్తం చేయగా.. మార్గదర్శి తరపు న్యాయవాది ఎం.వి దుర్గాప్రసాద్ స్పందిస్తూ అధికరణ 228 క్లాజ్ 2 కింద తెలంగాణ హైకోర్టుకు విచారించే పరిధి ఉంటుందన్నారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 30, 33, 40 కింద.. కోర్టు పరిధి లేదన్న ఏపీ తరపు న్యాయవాది పి.గోవింద రెడ్డి లేవనెత్తిన సెక్షన్లు ఇక్కడ వర్తించవన్నారు.
వారెంట్ గడువు శుక్రవారంతో ముగుస్తుందన్న ఆంధ్రప్రదేశ్ న్యాయవాది వాదనపై.. న్యాయమూర్తి స్పందిస్తూ స్పష్టత వచ్చే వరకు సోదాలు కొనసాగుతాయని రిజిస్ట్రార్ పేర్కొన్నందున ఈ వాదనను అనుమతించలేమన్నారు. ఈ కారణాల నేపథ్యంలో.. చందాదారుల వివరాలను వెల్లడించాలనడం వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగమని.. అందువల్ల వారెంట్ అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నామన్నారు.
మార్గదర్శి ప్రధాన కార్యాలయం తెలంగాణలో ఉన్నందున.. ఏపీ ప్రభుత్వానికి ఇక్కడ సోదాలు నిర్వహించే అధికారం లేదని మార్గదర్శి తరపు న్యాయవాది ఎం.వి దుర్గాప్రసాద్ వాదించారు. ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నందున.. చిట్‌ఫండ్ చట్టం ప్రకారం తెలంగాణకే పరిధి ఉంటుందన్నారు. దాని శాఖలున్న.. ఏపీకి కాదన్నారు. ఆ రాష్ట్రాల్లో ఉన్న శాఖలపైనే వాటికి పరిధి ఉంటుందన్నారు. ఏపీలోని 17 బ్రాంచీల్లో సోదాలు నిర్వహించారని.. ఒక్క శాఖలో కూడా లోపాలున్నట్లు చెప్పలేదన్నారు. అయినప్పటికీ.. ప్రధాన కార్యాలయం ఉన్న హైదరాబాద్‌లో లోపాలుంటాయన్న అనుమానంతో ఇక్కడికి వచ్చారన్నారు. కార్పొరేట్ కార్యాలయంపై ఆరోపణలుంటే.. విచారించే పరిధి తెలంగాణ ప్రభుత్వానికే ఉంటుందని పేర్కొన్నారు.