Dharani Portal Issues : రెవెన్యూ శాఖలో భూమి హక్కులు, రికార్డులకు చెందిన సమస్యల పరిష్కారం కోసం తెచ్చిన ధరణిలో మరిన్ని సమస్యలు ఎదురవు తున్నాయని.. హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయస్థానానికి వస్తున్న పిటిషన్ల ఆధారంగా పరిశీలిస్తే దాదాపు 20 వరకు సమస్యలు ప్రధానంగా ఉన్నట్లు పేర్కొంది. ఆ సమస్యలపై కలెక్టర్ ద్వారా గ్రామ, మండల, రెవెన్యూ అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరించి వాటిని పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. అందుకు నాలుగు వారాల గడువును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సీసీఎల్ఏకు హైకోర్టు ఇచ్చింది.
Telangana HC on Dharani Portal Issues : రెవెన్యూశాఖలో రిజిస్టర్ సేల్ డీడ్‌తో పాటు.. ఇతరత్రా సర్టిఫైడ్ కాపీలు ఇవ్వకపోవడం, ఇతర ధరణి సమస్యల పరిష్కారంలో జాప్యంపై దాఖలైన.. పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. నిర్ధిష్ట గడువులోగా ఈ-పట్టాదారు పాస్‌బుక్‌లో.. సవరణకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించకపోవడం, సర్వే, నిమిత్తం.. F-లైన్ దరఖాస్తులను స్వీకరించడం లేదు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసిన ఆస్తులకు విక్రయ దస్తావేజులు జారీ చేయడంలేదు. ధరణి పోర్టల్‌లో జీపీఏని రిజిస్ట్రేషన్ సమయంలో పట్టించుకోకపోవడం లేదన్నారు. ఏ కారణం చెప్పకుండా F-లైన్ దరఖాస్తులు సహా.. సరైన పద్ధతిలో సమర్పించలేదంటూ దరఖాస్తులను తిరస్కరించడం.. కోర్టు, డిక్రీలో టైటిల్ మార్పుపై స్పష్టత లేనప్పుడు.. ఇతర విధానాల్లో దరఖాస్తులు వచ్చినప్పుడు రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై అప్పీళ్లకు, రివిజన్ నిమిత్తం నిబంధనలు లేవన్నారు.