గడ్డిఅన్నారం మార్కెట్ నిమిత్తం బాటసింగారంలో స్థలాన్ని నోటిఫై చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను(TS High court on fruit market) సమర్పించాలంటూ ప్రభుత్వాన్ని గురువారం హైకోర్టు ఆదేశించింది. శుక్రవారానికి విచారణను వాయిదా వేస్తూ అప్పటివరకు తరలింపునకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని చెప్పింది. గడ్డిఅన్నారం మార్కెట్ తరలింపును సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హోల్‌సేల్ ఫ్రూట్ మార్కెట్ కమీషన్ ఏజెంట్స్ మరో ఇద్దరు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ(TS High court on fruit market) చేపట్టింది.
పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది జి.గంగయ్యనాయుడు వాదనలు వినిపించారు. 22.05 ఎకరాల్లో ఉన్న సుమారు రూ.1,500ల కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తూ మార్కెటింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమన్నారు. కొహెడలో 178 ఎకరాల్లో కొత్త మార్కెట్‌ను నిర్మిస్తామని ప్రతిపాదించిందని... ప్రస్తుతం బాటసింగారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిందన్నారు. అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవన్నారు. 40 ఎకరాలని చెబుతున్నా... 30 ఎకరాలు ప్రైవేట్ వారికి లీజుకు ఇచ్చారని, 10 ఎకరాల్లో రాళ్లురప్పలతో నిండి ఉందన్నారు. కేవలం 3 ఎకరాలే ఉందన్నారు. అక్కడ కోల్డ్ స్టోరేజీ, నీరు వంటి మౌలిక వసతులు లేవన్నారు.