ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కేసుల తర్వాతే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులపై విచారణ చేపట్టాలన్న విషయంలో.. విజయసాయిరెడ్డి తదితరులకు మంగళవారం తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండానే ఈడీ కేసులపై విచారణ చేపట్టవచ్చని హైకోర్టు తేల్చిచెప్పింది. సీబీఐ కేసుల తర్వాత.. లేదంటే కలిపి విచారణ చేపట్టేలా ఆదేశాలివ్వాలంటూ నిందితులు దాఖలు చేసిన 8 పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కోర్టు కొట్టేసింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులపై విచారణ చేపట్టవచ్చంటూ సీబీఐ/ఈడీ ప్రత్యేక కోర్టు జనవరి 11న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నిందితులు విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్, భారతి సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘ వాదనలను విన్న జస్టిస్ షమీమ్ అక్తర్ మంగళవారం తీర్పు వెలువరించారు. ఈడీ కేసుకు ఆధారమైన సీబీఐ కేసును కొట్టేస్తే ఈడీ కేసు విచారణ చేపట్టడం వల్ల ప్రయోజనం ఉండదన్న పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనను తోసిపుచ్చారు.
సీబీఐ కేసు తర్వాత గానీ, లేదంటే ఒకేసారి విచారణ చేపట్టవచ్చని, దీనిపై ఈ హైకోర్టుతో పాటు ఝార్ఖండ్, కేరళ, కర్ణాటక హైకోర్టులు స్పష్టత ఇచ్చాయన్న వాదనతో ఏకీభవించలేదు. ఈడీ చట్టంలోని సెక్షన్ 44కు వివరణ ఇస్తూ 2019లో చట్ట సవరణ వచ్చిందని, దీని ప్రకారం ప్రధాన కేసు (క్రిమినల్)తో సంబంధం లేకుండా ఈడీ కేసుపై విచారణ చేపట్టవచ్చని, ఒకవేళ క్రిమినల్ కేసును కొట్టేసినా, మరే రకమైన ఉత్తర్వులు జారీచేసినా ఈడీ కేసులో విచారణను కొనసాగించవచ్చని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ టి.సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇది స్వతంత్రమైనదని, మరో కేసుతో సంబంధం లేదని, ఈడీ కేసును నమోదు చేయడం వరకే క్రిమినల్ కేసును పరిగణనలోకి తీసుకుంటారన్నారని, మద్రాసు, బాంబే హైకోర్టులు ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాయన్నారు. పిటిషనర్లు తమకు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్న తీర్పులు సవరణకు ముందు వచ్చాయన్న వాదనలతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ పిటిషన్లను కొట్టేస్తూ తీర్పు వెలువరించారు. సీబీఐ, ఈడీ కేసులు వేర్వేరని తేల్చిచెప్పారు. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులపై ముందుగానే విచారణ చేపట్టవచ్చని పేర్కొన్నారు.