Telangana HC on Medical Science Council : రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో ఎన్నికయ్యే(ఎలెక్టెడ్) సభ్యుల సంఖ్య తగ్గించడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. తాత్కాలిక మండలి ఏర్పాటు సైతం చట్టవిరుద్ధమని పేర్కొంది. కౌన్సిల్‌లో ఎన్నికయ్యే సభ్యుల సంఖ్యను 13 నుంచి 5కు తగ్గిస్తూ 2015 ఆగస్టు 3న ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం.68ను, తాత్కాలిక కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తూ 2016 జనవరి 6న జారీ చేసిన జీఓ నం.15ను సవాలు చేస్తూ హెల్త్‌కేర్ రిఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ తదితరులు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. దీనిపై వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
చట్టంలో సవరణలు శాసనసభ ద్వారానే చేయాలి: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం కింద పాత చట్టాల అన్వయం పేరుతో ప్రభుత్వం సవరణలు తీసుకురావడం సరికాదని పేర్కొంది. చట్టంలో సవరణలను శాసనసభ ద్వారానే చేయాలని, జీఓ ద్వారా కాదని స్పష్టం చేసింది. ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్టం కింద ఏర్పాటైన మెడికల్ కౌన్సిల్‌లో ఎన్నికయ్యే సభ్యుల సంఖ్యను 13 నుంచి 5కు తగ్గించిన ప్రభుత్వం నామినేటెడ్ సభ్యుల సంఖ్యను యథాతథం(6)గా ఉంచిందని.. దీనివల్ల ఎన్నికైన సభ్యులు మైనారిటీకి చేరుకున్నారంది. అందువల్ల అన్వయం పేరుతో చట్ట సవరణకు తీసుకువచ్చిన జీఓ నం.68 చెల్లుబాటు కాదని పేర్కొంది.