వాయిదా పడిన పదో తరగతి పరీక్షలను జూన్ 8 నుంచి లేదా ఆ తర్వాత నిర్వహించుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈనెల 31 వరకు లాక్ డౌన్ ఉండగా పరీక్షలు నిర్వహించవద్దని స్పష్టం చేసింది. మార్చి 19 నుంచి 21 వరకు రెండు సబ్జెక్టులకు సంబంధించిన మూడు పరీక్షలు పూర్తయ్యాయి. అయితే కరోనా తీవ్రత దృష్ట్యా పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ ప్రైవేట్ ఉపాధ్యాయుడు బాలకృష్ణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పరీక్షలను వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో మార్చి 23 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగాల్సిన నాలుగు సబ్జెక్టులకు సంబంధించిన ఎనిమిది పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. మే నెలలోనే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విద్యా శాఖ హైకోర్టును కోరింది.
లాక్డౌన్ వేళ వద్దు..
వైద్యుల సూచనల మేరకు కరోనా నివారణ చర్యలన్నీ తీసుకుంటామని.. పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరారు. కరోనా తీవ్రత కొనసాగుతుండగా.. లాక్డౌన్ వేళ పరీక్షలు నిర్వహించడం మంచిది కాదని పిటిషనర్ తరఫు న్యాయవాది పవన్ కుమార్ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, బి.విజయ సేన్ రెడ్డి ధర్మాసనం... లాక్ డౌన్ కొనసాగుతుండగా పరీక్షలు నిర్వహించవద్దని తెలిపింది.