సచివాలయ భవనాలను కూల్చివేయాలనే నిర్ణయాన్ని సవాలుచేస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో సచివాలయ భవనాల కూల్చివేతపై నిపుణుల కమిటీ నివేదికను తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. అందులో పేర్కొన్న లోపాల్లో చాలా వరకు సరిదిద్దుకునేవే అని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుత భవనాలు మరమ్మతులు చేయలేనంత శిథిలావస్థలో ఉన్నట్లు నిపుణుల కమిటీ తేల్చినందునే కూల్చివేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అన్నీ ఒకేచోట నిర్మిస్తాం...
కొత్త సచివాలయాన్ని ఎంత విస్తీర్ణంలో నిర్మించబోతున్నారని, నమూనా ఎలా ఉంటుందని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సుమారు పది లక్షల చదరపు అడుగుల్లో అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే చోట ఉండే విధంగా నిర్మించాలని భావిస్తున్నట్లు... ఇంకా డిజైన్లు ఖరారు కాలేదని హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. న్యాయస్థానం స్టే ఇచ్చినందున డిజైన్ల ప్రక్రియ నిలిపివేశామని అదనపు అడ్వకేట్ జనరల్ తెలిపారు. అయితే తాము స్టే ఇవ్వలేదని కోర్టులో విచారణ పెండింగ్ ఉన్నందున భవనాలను కూల్చవద్దని మాత్రమే కోరామని స్పష్టం చేసింది.