Telangana High Court On Police Station CC Cameras : ఈమెయిల్లో వచ్చిన రెండు పిల్లను సుమోటోగా తీసుకొని.. హైకోర్టు విచారణ చేపట్టింది. అందులో రాష్ట్రవ్యాప్తంగా 369 పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. మరో 293 పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రక్రియ జరుగుతోందని నివేదించింది. పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు లేవని.. దానివల్ల లాకప్ డెత్‌లు, నిందితులపై దాడులు, వేధింపులు పెరుగుతున్నాయంటూ అందిన ఈమెయిల్‌ను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించింది.
369 Police Stations CC Cameras Set : అయితే ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగులో ఉందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించామని.. ఈనెలలో విచారణ ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తున్నందున.. ఈ అంశంపై ఇక్కడ వాదనలు చేయడం అవసరం లేదంటూ పిల్‌పై విచారణను సీజే ధర్మాసనం ముగించింది.
జీహెచ్ఎంసీలో పటిష్ఠ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి : జీహెచ్ఎంసీలో పటిష్ఠ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టుకు వచ్చిన మెయిల్‌ను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు పరిగణనలోకి తీసుకొని.. విచారణను చేపట్టింది. ఇటీవల వరదల్లో ఇద్దరు పిల్లలు కొట్టుకుపోయారని ఒక వ్యక్తి హైకోర్టుకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆ మెయిల్లో వరద ముప్పుపై.. జీహెచ్ఎంసీ డ్రైనేజీ వ్యవస్థలో పటిష్టమైన హెచ్చరిక వ్యవస్థ ఉండాలని సూచించారు.