Telangana HC on PG Medical Seat Allotment to Transgender: ట్రాన్స్‌జెండర్ రిజర్వేషన్ కోటా కింద పీజీ వైద్య విద్యలో తనకు సీటు ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ డాక్టర్ కొయ్యల రూత్‌జాన్‌పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం 2023 నీట్ పీజీలో పొందిన మార్కుల ప్రకారం పిటిషనర్ డాక్టర్ కొయ్యల రూత్‌జాన్‌పాల్ అడ్మిషన్ పొందడానికి అర్హత ఉన్నా.. సీటు ఎందుకివ్వలేదని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఎన్‌ఎంసీ (జాతీయ వైద్య కమిషన్), రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
High Court on PG Medical Seats Allotment : ఈ క్రమంలోనే థర్డ్ జెండర్ వారి పట్ల దయతో కాకుండా.. వారి స్థానంలో ఉండి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం.. ఎస్సీ, ఓబీసీ కోటాలో ప్రవేశాలు పొందిన చివరి అభ్యర్థులు నీట్ పీజీ-2023లో పొందిన మార్కుల వివరాలనూ సమర్పించాలని జాతీయ వైద్య కమిషన్‌ను ఆదేశిస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది.
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూసిన నీట్ యూజీ ఫలితాలు గత వారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థి ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ఏపీ విద్యార్థి బోర వరుణ్ చక్రవర్తి, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రభంజన్ 99.99 పర్సంటైల్‌తో తొలి ర్యాంకు సాధించారు. నీట్‌కు అర్హత సాధించిన వారిలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, యూపీ, రాజస్థాన్‌ల నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నట్టు ఎన్‌టీఏ తెలిపింది.
దేశ వ్యాప్తంగా ఈ ఏడాది నీట్‌కు మొత్తం 11 లక్షల 45 వేల 976 మంది అర్హత సాధించారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 42 వేల 836 మంది, తెలంగాణ నుంచి 42 వేల 654 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రానికి చెందిన కె.జి.రఘురాం రెడ్డి అనే అభ్యర్థి జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. EWS కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎల్ ప్రవధాన్ రెడ్డి, ఎస్సీ కేటగిరీలో అదే రాష్ట్రానికి చెందిన విద్యార్థి కె.యశశ్రీకి వరుసగా తొలి, రెండో ర్యాంకులు సొంతం చేసుకున్నారు.