Telangana HC on Land Allotment for Caste Societies : కమ్మ, వెలమ సంఘాలకు ప్రభుత్వం కేటాయించిన భూములను హైకోర్టు నిలిపేసింది. హైదరాబాద్‌లోని ఖానామెట్ వద్ద కమ్మ, వెలమ కులసంఘాలకు చెరో అయిదెకరాలను కేటాయిస్తూ 2021 జూన్ 30న ప్రభుత్వం జీవో 47 జారీ చేసింది. జీవోను సవాల్ చేస్తూ కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ ఎ.వినాయక్ రెడ్డి వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ జరిపింది. కులాల వారీగా భూములు కేటాయించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. గ్రామీణ విద్యార్థులు, పేదలు, ఎస్సీ, ఎస్టీ వంటి అణగారిన వర్గాలకు కేటాయిస్తే అర్థం చేసుకోవచ్చుకానీ.. బలమైన కులాలకు ఉచితంగా భూములు ఎందుకు ఇవ్వాలని హైకోర్టు ప్రశ్నించింది.
ఒక్కో కులానికి భూములు పంచేస్తూ వెళ్తారా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. ఇది కూడా ఓ రకమైన భూ కబ్జానేనని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. సాయి సింధు ఫౌండేషన్‌కు రాయితీ ధరకు భూమి ఇచ్చినందుకే ఆ ఉత్తర్వులను ఇటీవల కొట్టివేసినట్లు హైకోర్టు గుర్తు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు పలు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని హైకోర్టు పేర్కొంది. భూకేటాయింపుల జీవోపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ స్టే కొనసాగుతుందని స్పష్టం చేసిన ధర్మాసనం.. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది.
HC on Land Allotment Land Allotment :పిటిషన్‌లోని అభ్యంతరాలపై వెలమ సంఘం కౌంటరు దాఖలు చేసింది. గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ కమ్మ సంఘం తరఫున కౌంటరు వేయనందున.. వారి వాదనలు వినబోమని ఈనెల 16న హైకోర్టు పేర్కొంది. అయితే కౌంటరు దాఖలు చేస్తామని తమ వాదనలు కూడా వినేందుకు అవకాశం ఇవ్వాలని కమ్మ సంఘం తరఫు న్యాయవాది కోరడంతో హైకోర్టు అంగీకరించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తదుపరి విచారణను ఆగస్టు 2కి వాయిదా వేసింది.
HC Cancel Land Allotment : బీఆర్ఎస్ ఎంపీకి షాక్.. సాయి సింధు ఫౌండేషన్‌కు భూకేటాయింపు రద్దు
HC on SC ST Commissions : మరోవైపు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటులో జాప్యంపైహైకోర్టువిచారణ చేపట్టింది. ఛైర్మన్, సభ్యులను నియమించట్లేదన్న పిల్‌పై ధర్మాసనం విచారించింది. నియామకానికి తీసుకున్న చర్యలు తెలపాలని గతంలోనే ఆదేశించింది. ఈ క్రమంలోనే రెండు వారాల సమయం ఇవ్వాలని ఏజీ బీఎస్ ప్రసాద్ న్యాయస్థానాన్ని కోరారు. ఏజీ విజ్ఞప్తిని అంగీకరించిన హైకోర్టు.. విచారణను జులై 18కి వాయిదా వేసింది.
High Court Status Co Pharmacy Land : మరోవైపు ఫార్మాసిటీకి 1000 ఎకరాల దేవాలయ భూమి కేటాయింపుపై మంగళవారం హైకోర్టు స్టేటస్ కో విధించింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం సింగారం, నందివనపర్తి గ్రామాల్లో ఓంకారేశ్వరస్వామి ఆలయానికి చెందిన 1,022 ఎకరాలను భూసేకరణకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి దేవదాయ భూమి సేకరణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై నలుగురు రైతులు దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. దీనికి సంబంధించిన గత ఉత్తర్వులను పరిశీలించాల్సి ఉందని.. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి: